లైసెన్సులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే | All licences to be available in online in TG | Sakshi
Sakshi News home page

లైసెన్సులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

Jul 25 2020 3:30 AM | Updated on Jul 25 2020 3:35 AM

All licences to be available in online in TG - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :
స్వయంగా రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వివిధ రకాల పౌరసేవలను పొందే సదుపాయం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. లెర్నింగ్‌ లైసెన్సు, డ్రైవింగ్‌ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్‌కార్డులు వంటి ఐదు రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. దీనికి సంబంధించిన పోర్టల్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్తులో మరో 12 రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ, రవాణా కమీషనర్‌ ఎంఆర్‌ఎం రావు, టీఎస్‌టీసీ ఎండీ టి.వెంకటేశ్వర్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభతరం చేసేవిధంగా ఆన్‌లైన్‌ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటి వద్దనే తమకు కావలసిన సేవలను పొందేవిధంగా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవలను ప్రవేశపెట్టారు.

ఇంటి నుంచే నేరుగా.... 
ఇప్పటివరకు ఆర్టీఏ అందజేసే వివిధ రకాల సేవల కోసం వినియోగదారులు మొదట ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్‌లో కేటాయించిన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. కానీ తాజాగా ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల డూప్లికేట్‌ లెర్నింగ్‌ లైసెన్స్, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, రవాణా వాహనాలు నడిపే డ్రైవర్‌లకు ఇచ్చే బ్యాడ్జ్, డ్రైవింగ్‌ లైసెన్సుల డాక్యుమెంట్‌ల స్థానంలో స్మార్ట్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ (ఆర్‌టీడీఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రవాణాశాఖ ఈ సర్వీసులను అందజేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఇలా లభిస్తాయి.... 
ఎంగవర్నెన్స్, టి యాప్‌ ఫోలియో ద్వారా రవాణాశాఖ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ను పొందవచ్చు. 
వినియోగదారులు తమ పేరు, తండ్రి పేరు, చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబర్‌లతో పాటు సెల్ఫీ క్లిక్‌ చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.  
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా సెల్ఫీని తనిఖీ చేస్తారు.  
అలాగే వినియోగదారుడి పేరు, చిరునామాలలో ఏమైనా తప్పులు ఉంటే బిగ్‌ డేటా ఆధారంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది.  
డీప్‌ లెర్నింగ్‌ ఆధారిత ఇమేజ్‌లతో ఫొటోల్లో ఉండే వైవిధ్యాలను కూడా గుర్తిస్తారు.  
అనంతరం వినియోగదారుడి మొబైల్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారం అందుతుంది.ఆ తరువాత ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి.  
అనంతరం వినియోగదారులు ఎంపిక చేసుకొన్న పౌరసేవలు ఆన్‌లైన్‌లోనే తీసుకొనే అవకాశం లభిస్తుంది. మరో 15 రోజుల్లో 6 రకాల పౌరసేవలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా అందజేయనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. శాశ్వత లైసెన్స్, లెర్నింగ్‌ లైసెన్స్, పర్మిట్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు వంటివి ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఆ తరువాత మరో 6 సర్వీసులను కూడా ఆన్‌లైన్‌ పరిధిలోకి తేనున్నారు.  
వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయవలసిన సేవలు మినహా మిగతావన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement