
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న బీజేపీ, చివరకు విపక్షాలు కూడా లేకుండా చేయాలని చూస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు విజయరాఘవన్ మండిపడ్డారు. మోదీ, అమిత్‌షాలు శాశ్వతం కాదని అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవన్ మాట్లాడుతూ బీజేపీ సర్కార్ నిరంకుశ రాజకీయాలు చేస్తూ పార్లమెంట్, అసెంబ్లీ.. తదితర ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
వామపక్షాల పాలన ఉన్నందునే అభివృద్ధి, మానవాభివృద్ధి సూచిలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. వామపక్షాల పాలన ఉండడం వల్ల భూసంస్కరణలు, భూమి పునఃపంపిణీ అక్కడ సాధ్యమైందని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న తరుణంలోనూ ఆకలి దేశంగా భారతదేశం ఉండటం శోచనీయమన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్టీ, ఎస్సీ మహిళలపై ఆకృత్యాలు అధికమయ్యాయని చెప్పారు. ఈ సభల్లో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బి.వెంకట్, ఉపాధ్యక్షుడు విక్రమ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.