నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

All Arrangements Done For Ganesh Immersion In Hyderabad - Sakshi

ఉదయం 6 గంటల నుంచే ఊరేగింపులు.. హైదరాబాద్‌ వ్యాప్తంగా సీసీ, వీడియో కెమెరాల నిఘా

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు గంగమ్మ ఒడికి గణనాథుడు తరలనున్నాడు. దీంతో ఊరేగింపు, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఘట్టం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అదనపు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల బైండోవర్, వారిపై నిఘా ఉంటుంది. ఏటా నిమజ్జన కార్యక్రమం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సాగుతోంది. దీంతో ఈ ఏడాది మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీల సహకారంతో మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాములోపు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

విగ్రహాల తరలింపునకు వాహనాలు లభించని వారికి పోలీసులే ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు హ్యాండ్‌ హెల్డ్‌ కెమెరాలను వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు సాయుధ బలగాలూ మోహరించనున్నాయి. విధుల్లో ఉండే సిబ్బందికి షిఫ్ట్‌ విధానం అమలు చేస్తూ వారికి అవసరమైన ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్స్‌ అందిస్తున్నారు. బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసు అధికారులు ఇతర విభాగాలతో పాటు శాంతి, మైత్రి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు. 

ఏర్పాట్ల వివరాలివి 
నిమజ్జనం జరిగే ప్రదేశాలు:  ట్యాంక్‌బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్‌పేట చెరువు, సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్, సఫిల్‌గూడ/మల్కాజ్‌గిరి చెరువులు, హస్మత్‌పేట చెరువు. 
హుస్సేన్‌సాగర్‌కు వచ్చేవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు శివారులోని మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని విగ్రహాలు. 
ఊరేగింపుల్లో డీజేలు నిషేధం: నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఇలాంటి తీవ్రమైన శబ్దం వచ్చే వాటివల్ల పోలీసు కమ్యూనికేషన్‌ వ్యవస్థకు నష్టం ఉంటుంది.  
మద్యం విక్రయాలు బంద్‌:  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలు నిషేధిస్తూ హైదరాబాద్‌ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నగర వ్యాప్తంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలు జరపకూడదని ఆదేశించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top