ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా! 

Additional DG Swathilakra in Sakshi interview

పూర్తి రక్షణ.. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్‌ 

375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు  

ఇప్పటికే వంద కంపెనీల బలగాలు విధుల్లో ఉన్నాయి 

అవసరం మేరకు పక్క రాష్ట్రాల నుంచి  

సాయుధ పోలీసుల తరలింపు  

టీఎస్‌ఎస్పీ బెటాలియన్స్‌ అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా

నాగోజు సత్యనారాయణ: రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తిస్థాయిలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు టీఎస్‌ఎస్పీ(తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌) బెటాలియన్స్‌ అడిషనల్‌ డీజీ, కేంద్ర బలగాల భద్రత విధులకు సంబంధించి రాష్ట్ర నోడల్‌ అధికారి స్వాతి లక్రా వెల్లడించారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితుల ఆధారంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఎన్నికల భద్రత విధుల్లో కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల మోహరింపు, ప్రధాన విధులకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా పంచుకున్నారు.  

కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ప్రధానంగా అప్పగించే ఎన్నికల విధులు...? 
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అన్ని దశల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసులకు సహకారంగా ఉంటాయి. ప్రధానంగా వాహన తనిఖీలు, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, ఇతర కీలక పాయింట్లలో పహారా, పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు..ఓటింగ్‌ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంల వద్ద కీలకమైన భద్రత విధులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగిస్తాం. 
ఎన్నికల విధుల్లో కేంద్ర బలగాల మోహరింపు 

ఏ ప్రాతిపదికన ఉంటుంది..? 
స్థానికంగా ఎన్ని పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి..అందులో ఎన్ని సమస్యాత్మకమైనవి, సున్నితమైనవి ఉన్నాయన్న నివేదిక ఆధారంగా కేంద్ర బలగాలను పంపుతున్నాం. ప్రస్తుతానికి వంద కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా పంపించాం. స్థానికంగా వాళ్లకు వసతి సదుపాయానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌స్టేషన్లు,, గత ఎన్నికల్లో నమోదైన ఘటనల ఆధారంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరం మేరకు అదనపు బలగాలను కేటాయిస్తున్నాం. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.  

కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించడానికి కారణం..? 
స్థానికంగా యూనిట్‌ ఆఫీసర్లు కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌లు చేస్తున్నారు. దీని ముఖ్యఉద్దేశం..మీ ప్రాంతంలో భద్రత కోసం పూర్తి సన్నద్ధంగా మేం ఉన్నాం అని పోలీసు నుంచి ప్రజలకు భరోసా ఇవ్వడమే. దీనివల్ల ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం. అదే సమ యంలో సంఘ విద్రోహశక్తులకు ఒక్కింత హెచ్చరిక మాదిరిగా ఈ కవాతులు చేయడం సర్వసాధారణమే.  

కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు తోడు ఇతర రాష్ట్రాల పోలీసు సిబ్బంది బందోబస్తుకు వస్తారా..? 
ఇంకా కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నందున అందుకు అనుగుణంగా విడతల వారీగా కేంద్ర సాయుధ బలగాల సర్దుబాటు ఉంటుంది. ఒక్కో కంపెనీలో సరాసరిన 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ లెక్కన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల నుంచే 30 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరికి అదనంగా ఎలక్షన్‌ పది రోజుల ముందు నుంచి పోలింగ్‌ తేదీన విధుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసు బలగాల సిబ్బందితో పాటు హోంగార్డులు సైతం ఉంటారు.   

2018 ఎన్నికల భద్రత విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలే ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగిందా..?  
గతంలో 279 కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా, ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఎక్కువ కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ఈసారి మొత్తం 375 కంపెనీల బలగాలను మనం అడిగాం. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు వస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top