తెలంగాణలో పచ్చదనం పెరిగింది 

Actor Prakash Raj Participated In Green India Challenge - Sakshi

‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో మొక్కలు నాటిన ప్రకాశ్‌రాజ్‌

షాద్‌నగర్‌ టౌన్‌: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్కలు నాటారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ప్రకాశ్‌రాజ్‌ తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు పెంచే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచించి హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారని, గత ఆరేళ్ళ కాలంలో తెలంగాణలో పచ్చదనం పెరిగిపోయిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌లు మట్టిమనుషులని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినీ నటులు మోహన్‌లాల్, సూర్య, రక్షిత్‌ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు ప్రకాశ్‌రాజ్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విసిరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top