లింక్‌ రోడ్డుపై ఏసీబీ విచారణ

ACB And HMDA Officials Inspecting 100 Foot Wide Narrow Road - Sakshi

కదలనున్న అక్రమార్కుల డొంక

భూసేకరణ చేసిన భూమిలోనే అనుమతులు

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

మణికొండ: ఓ వైపు హైదరాబాద్‌ చుట్టూరా లింక్, స్లిప్‌ రోడ్లను అభివృద్ది చేసి ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాభివృద్ది శాఖలు ప్రయత్నిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా హెచ్‌ఎండీఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 2015లో భూసేకరణ చేసిన స్థలంలోనే ఏకంగా బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లకు 2017లో అనుమతులు జారీ చేసింది. దాంతో హైదరాబాద్‌ శివారు, ఐటీ జోన్‌కు పక్కనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల ప్రజలకు ఔటర్‌రింగ్‌ రోడ్డును కలుపుతూ అందుబాటులోకి రావాల్సిన లింక్‌ రోడ్డు రాకుండా పోయింది. అదే విషయాన్ని మార్చి 25న ‘సాక్షి’ దినపత్రిక మొదటి పేజీలో ‘రోడ్డెందుకు సన్నబడింది’ అనే శీర్షికన కథనం ప్రచురించింది.

దాంతో స్పందించిన  మంత్రి కె.తారకరామారావు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. అదే కథనానికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డిలు పట్ణణాభివృద్ది శాఖ మంత్రికి మాస్టర్‌ ప్లాన్‌లో చూపిన విధంగా అలకాపూర్‌ టౌన్‌షిప్‌ మీదుగా వంద అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అడ్డుగా వచ్చిన అపార్ట్‌మెంట్‌లను కూల్చాలని లేఖ రాశారు. అప్పట్లోనే ఓ స్థాయి విచారణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దానికి అంగీకరించని ప్రభుత్వం ఏకంగా ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించింది.

ఏసీబీ అధికారుల పరిశీలన
నార్సింగ్, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అలకాపూర్‌ టౌన్‌షిప్‌ మీదుగా రేడియల్‌ రోడ్డు 4 నుంచి రేడియల్‌ రోడ్డు 5 వరకు నిర్మించాల్సిన వంద అడుగుల లింక్‌ రోడ్డును గురువారం ఏసీబీ, హెచ్‌ఎండీఏ టౌన్‌ప్లానింగ్, ప్రాజెక్ట్స్‌ విభాగం అధికారులు పరిశీలించారు. రోడ్డు మధ్యల వరకు అపార్ట్‌మెంట్‌ల సముదాయానికి అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు కొలతలు, రోడ్డులోకి వచ్చిన భవనం కొలతలను తీసుకున్నారు.

అనుమతులు జారీ చేసే సమయంలో రోడ్డు స్థలాన్ని ఎందుకు పట్టించుకోలేదని హెచ్‌ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. రోడ్డుకు చెందిన ఎంత స్థలం ఆక్రమణకు గురైందో మరింత లోతుగా సర్వే చేసి నివేదికను అందజేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. విచారణలో హెచ్‌ఎండీఏ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కృష్ణకుమార్, నారాయణరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ దీపిక, స్థానిక టీపీఎస్‌ సంతోష్‌సింగ్, ఏసీబీ అధికారులు శరత్‌లతో పాటు మరికొంత మంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top