రూల్స్‌ అన్నారు.. అనుమతులు ఇచ్చేశారు

Academic Regulations Jawaharlal Nehru Technological University Hyderabad - Sakshi

90% ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లోపాలున్నట్లు గుర్తింపు! 

అయినా ఒక్క రోజులోనే 108 కాలేజీలకు అనుబంధ గుర్తింపు 

ఇదీ జేఎన్‌టీయూహెచ్‌ తీరు 

పరిశీలన కమిటీ నివేదికపై గోప్యత

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, రూల్స్‌ పాటించకపోతే అనుబంధ గుర్తింపే ఇవ్వమని జేఎన్‌టీయూహెచ్‌ నిన్నటిదాకా ఊదరగొట్టింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో! బుధవారం ఒక్కరోజే ఏకంగా 108 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 11 కాలేజీలు కూడా కలిపితే, రాష్ట్రంలో 119 కాలేజీలకు అనుమతులు వచ్చేశాయ్‌.

ఇది ఏటా జరిగే తంతు.. అనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, గతంలోకన్నా భిన్నంగా వ్యవహరిస్తామని తెలిపింది. గత నెల 25వ తేదీన యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ మీడియాకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌కు పీహెచ్‌డీ, అధ్యాపకులకు ఇతర అవసరమైన అర్హతలు ఉన్నాయా.. లేదా చూస్తామన్నారు. కాలేజీలు గుడ్డిగా అధ్యాపకుల జాబితా పంపితే.. వాళ్లు చదివిన యూనివర్సిటీలకు వెళ్లి మరీ సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు.

సరైన అర్హతలు లేని అధ్యాపకులతో కాలేజీలు నడిపించే విధానాన్ని మారుస్తామని వీసీ తెలిపారు. అన్ని కాలేజీలను తమ కమిటీ పరిశీలించి, అర్హతలున్నాయని తెలుసుకున్నాకే అఫిలియేషన్‌ ఇస్తామని ఆయన పదేపదే చెప్పారు. కమిటీ అయితే అన్ని కాలేజీలకు వెళ్లింది. ఈ పరిశీలనలో 90 శాతం కాలేజీల్లో లోపాలున్నాయని, మౌలిక వసతుల్లేవని, అధ్యాకులు నిబంధనల ప్రకారంలేరని గుర్తించినట్టు తెలిసింది. అయితే, కమిటీ పరిశీలించి.. ఇచ్చిన నివేదికను మాత్రం జేఎన్‌టీయూహెచ్‌ గోప్యంగా ఉంచింది.

దీనిపై యూనివర్సిటీ అధికారులు కనీసం పెదవి విప్పేందుకు కూడా సాహసించడం లేదు. అంతలోనే ఇన్ని కాలేజీలకు అర్హులైన అధ్యాపకులు ఎలా వచ్చారో? మౌలిక సదుపాయాలు ఎలా సమకూరాయో తెలియదు కానీ.. అఫిలియేషన్‌ అయితే ఇచ్చేసింది.  

అనుమతులు సరే.. అధ్యాపకుల సంగతేంటి?  
అధ్యాపకుల సమస్యలు పట్టించుకోకుండా, ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులివ్వడం దారుణమని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్‌ కాలేజీల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోశ్‌కుమార్‌ అన్నారు. చాలా కాలేజీల్లో జీతాలే ఇవ్వడం లేదని, వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో అసలు అధ్యాపకులు ఉన్నారా అనే విషయాన్ని కమిటీ పరిశీలించిందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top