టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌లో 79 శాతం ఉత్తీర్ణత

79. 82 Percent Of Students Passed Out In 10th Supplementary Examinations - Sakshi

ఉత్తీర్ణుల్లో బాలికలదే పైచేయి

సిద్దిపేట ఫస్ట్‌.. ఆసిఫాబాద్‌ లాస్ట్‌

ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 79.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణుల య్యాయి. పాసయిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో (97.99 శాతం) ఉంటే, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా (53.11 శాతం)లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆగస్టు 1 నుంచి 10 వరకూ జరిగిన టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెగ్యులర్‌గా జరిగిన పరీక్షల్లో కూడా ఈసారి 90 శాతంపైనే ఫలితాలు వచ్చినట్టు దేవసేన తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు లేకపోయినా, ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు. 

నేటి నుంచి రీ కౌంటింగ్‌
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్‌లో విద్యార్థి పేపర్‌ను ఉపాధ్యాయులే తిరిగి పరిశీలిస్తారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తే, విద్యార్థి రాసిన సమాధాన పత్రం ప్రతిని ఇంటికి పంపుతారు. దీంతో విద్యార్థి స్వయంగా పరిశీలించుకునే వీలుంటుంది. 

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం: దేవసేన
టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన తెలిపారు. కాగా, రాష్ట్రంలోని స్కూల్‌ విద్యార్థులకు మొదటి విడత యూనిఫాంలు పంపామని, రెండో విడత కూడా పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ ఏడాది 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఆ పిల్లలను క్రమంతప్పకుండా స్కూళ్లకు పంపే విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, టీచర్ల నియామకం గురించి ప్రభుత్వానికి వినతి పంపామని ఆమె వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top