ఏప్రిల్‌లోనే ఒకే దఫాలో పంపిణీకి చర్యలు
చౌకధరల దుకాణాలకు దశలవారీగా సరఫరా
వేసవిలో పేదలకు ఊరట కలిగించేందుకే..
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత (రేషన్)కార్డు లబ్ధిదారులకు భారీ వెసులుబాటు కల్పించాయి. ఏప్రిల్ మాసంలో ఒకేసారి మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) కోటాను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించి రేషన్ కోటాను విడుదల చేసి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు పీడీఎస్ బియ్యం సరఫరా ప్రారంభించింది.
కేటాయింపులు ఇలా..
మూడు జిల్లాల పరిధిలో సుమారు 21,46,995 ఆహార భద్రత కార్డులున్నాయి. మొత్తం 76,91,452 యూనిట్లు ఉన్నాయి. తాజాగా మూడు నెలల కోటా కింద దాదాపు 14,27,621.31 క్వింటాళ్ల పీడీఎస్ బియాన్ని విడుదల చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్ధ నిబంధనల ప్రకారం ఆహార భద్రత కార్డులోని ప్రతి యూనిట్ (లబ్ధిదారు)కు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నారు. తాజాగా మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తున్నందున ఒక్కో యూనిట్‌కు 18 కిలోల చొప్పున నలుగురు సభ్యులున్న కుటుంబానికి 72 కిలోలు, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 90 కిలోలు ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు మాత్రం నెలకు 35 కిలోల చొప్పున మూడు నెలలకు కలిపి 105 కిలోలు పంపిణీ చేస్తారు. లబి్ధదారులు పోర్టబిలిటీ సౌకర్యం ద్వారా అందుబాటులోని ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో బియ్యం తీసుకోవచ్చు.
ఈ–పాస్‌లో మార్పులు చేర్పులు.
లబ్ధి కుంటుబాలకు ఒకేసారి మూడు నెలల కోటా పంపిణి చేస్తుండటంతో అందుకు అనుగుణంగా ఈ–పాస్ (బయోమెట్రిక్) మిషన్లలో సాంకేతిక మార్పులు చేర్పులు చేస్తున్నారు. సరుకులు డ్రా చేసే లబ్ధిదారు ఒక్కో నెలకు విడివిడిగా మూడుసార్లు కాకుండా ఒకేసారి వేలిముద్ర వేసేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నారు.
సవాల్‌గా మారిన నిల్వలు
ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో మూడు నెలల స్టాక్ ఉంచేంత స్థలం లేకపోవడంతో బియ్యం నిల్వ చేయడం డీలర్లకు తలకు మించిన భారంగా తయారైంది. చాలా దుకాణాలు చిన్నపాటి మడిగెల్లో నిర్వహిస్తుండటంతో వందల క్వింటాళ్ల బియ్యాన్ని భద్రపరచడంపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల డిమాండ్ మేరకు దశలవారీగా దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తేందుకు పౌరసరఫరా అధికారులు చర్యలు చేపట్టారు.


