దీపం వెలిగింది.. | - | Sakshi
Sakshi News home page

దీపం వెలిగింది..

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

తిరుప్పరకుండ్రం రాతిస్తంభంపై దేదీప్యమానంగా వెలిగిన దీపం

మురుగన్‌ భక్తుల ఆనంద తాండవం

సుప్రీంకోర్టు కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు

సీఆర్‌పీఎఫ్‌ నిఘా నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమం

మార్మోగిన హరోహర

దేదీప్యమానంగా వెల ుగుతున్న దీపం

తరలి వచ్చిన భక్తులు

సాక్షి, చైన్నె: మదురై జిల్లా తిరుప్పరకుండ్రంలో తమిళ్‌ కడవుల్‌ మురుగన్‌ ఆలయం ఆరుపడై వీడులలో మొదటిదిగా ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. కొండ దిగువన ఆలయం, మధ్య భాగంలో ఉచ్చి పిళ్లయార్‌ ఆలయం, ఆపై భాగంలో దీప స్తంభం, ఆ తదుపరి సిక్కింధర్‌ బాబా దర్గా ఇక్కడ ఉన్నాయి. మతసామరస్యానికి ప్రతీకంగా ఉంటూ వస్తున్న తిరుప్పరకుండ్రంలో గత కొన్నిదశాబ్దాలుగా దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న నినాదం సాగుతూ వస్తోంది. ఇందుకు గత ఏడాది నుంచి మరింత బలం పెరిగింది. గత ఏడాది హైకోర్టు మధురై ధర్మాసనం దీపం వెలిగించాల్సిందేనని ఆదేశించినా, నాటి పాలకులు ఆచరణలో పెట్టలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది. ఈ వ్యవహారం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. మురుగన్‌ భక్తుల దశాబ్దాల కలను నెరవర్చే విధంగా గత వారం సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కార్తీక దీపం రోజైన ఈనెల 24వ తేదీన ఆ స్తంభంపై దీపం వెలిగించాల్సిందేనని కోర్టు స్పష్టంచేసినా పాలకులు భేఖాతరు చేశారు. దీంతో వ్యవహారం కోర్టు ధిక్కారం పరిధిలోకి చేరింది. తిరుప్పరకుండ్రం ఆలయ కొండపై ఉన్న దీప స్తంభంలో కార్తీక దీపం వెలిగించే వివాదంలో సుప్రీంకోర్టు ఆలయ ధర్మకర్తల మండలిని (ట్రస్టీ బోర్డు) రద్దు చేసింది. శనివారం సాయంత్రం 5 గంటలకు దీపం వెలిగించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలను కోర్టుల జారీ చేసింది. ఇందుకోసం కమిటీని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌. వైద్యనాథన్‌, జస్టిస్‌ వి. పార్థిబన్‌ నేతృత్వంలోని కమిటీ శనివారం ఉదయాన్నే మదురై అవనియాపురంలోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో సమావేశమయ్యారు.

ఉదయం నుంచి ఉత్కంఠగా..

ఉదయం 11.24 గంటలకు న్యాయమూర్తుల బృందం తిరుప్పరంకుండ్రం ఆలయానికి చేరుకుంది. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ జయరామన్‌ నేతృత్వంలో, ఆలయ డిప్యూటీ కమిషనర్‌ జి. సెల్వి సమక్షంలో అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలోని సత్యగిరీశ్వర స్వామి, కర్పగ వినాయకుడు, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల సన్నిధుల్లో న్యాయమూర్తులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ జస్టిస్‌ వైద్యనాథన్‌కు అర్చకులు పరివట్టం కట్టి, పూలమాలలతో సత్కరించారు. తరువాత తిరువాచ్చి మండపం ఎదుట కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు సిద్ధం చేసిన 3 మట్టి పాత్రలు (ప్రమిదలు), 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల కాడా వస్త్రం, 5 కిలోల కర్పూరం తదితర పూజా సామగ్రికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆ సామగ్రిని న్యాయమూర్తులకు అందజేశారు. జస్టిస్‌ వైద్యనాథన్‌, జస్టిస్‌ పార్థిబన్‌, మదురై జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కృష్ణకు ఒక్కొక్కటి చొప్పున మూడు మట్టి పాత్రలను అర్చకులు అందించారు. అనంతరం ఆలయ సిబ్బంది పూజా సామగ్రిని మోసుకురాగా, న్యాయమూర్తుల బృందం ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరింది. గిరిప్రదక్షిణ వీధుల గుండా మంగళవాయిద్యాలు మోగుతుండగా, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలకగా, వారు కొండ దిగువ ప్రాంతమైన కోట్టైత్తెరుకు కాలినడకన చేరుకున్నారు. కొండ దిగువకు చేరుకున్న న్యాయమూర్తులు తమ చేతుల్లో ఉన్న మట్టి పాత్రలను ఆలయ సిబ్బందికి అప్పగించి, దీపం వెలిగించేందుకు కొండపైకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో నగర పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీల అనంతరం సుమారు 30 మందికి పైగా మెట్ల మార్గం ద్వారా కొండపైకి బయలుదేరారు. ఆ సమయంలో నగర పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ ఇనిగో దివ్యన్‌ ఆలయ సిబ్బందికి తప్ప ఇతరులకు అనుమతి లేదని స్పష్టంచేస్తూ, భద్రతా బాధ్యతలను సీఆర్పీఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. దీనిపై అక్కడ గుమిగూడిన భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం కొండ పరిసరాలు, కొండపై దీపస్తంభం ఉన్న ప్రాంతాలను సీఆర్‌పీఎఫ్‌ భద్రత వలయంలోకి తీసుకొచ్చారు. దీపస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఆగమేఘాలపై చేశారు.

దశాబ్దాల కాలం నాటి మురుగన్‌ భక్తుల కల నెర వేరింది. సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ, సీఆర్‌పీఎఫ్‌ భద్రత నడుమ శనివారం సాయంత్రం 5 గంటలకు కొండపై ఉన్న దీప స్తంభంలో దేదీప్యమానంగా కార్తీక దీపం వెలిగించారు. ఈ దృశ్యాన్ని కనులారా చూసిన భక్తులు హరోం..హర నామస్మరణను మార్మోగించారు. భక్తి పారవశ్యంతో ఆనందం తాండవం చేశారు.

నెరవేరిన చిరకాల వాంఛ

భక్త జనం పారవశ్యం..

సరిగ్గా సాయంత్రం 5 గంటలకు కార్తీక దీపం వెలిగించాలని అధికారులు నిర్ణయించారు. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేయించేందుకు మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. వైద్యనాథన్‌ , హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి. పార్థిబన్‌ తో కూడిన కమిటీ పర్యవేక్షించింది. కొండపై ఉన్న సికందర్‌ దర్గా వద్ద కూడా పారామిలిటరీ సిబ్బంది పహారా ఏర్పాటు చేశారు. దర్గాకు వచ్చివెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సంప్రదాయబద్ధంగా పూజలు దీప స్థంభం వద్ద జరిగాయి. సరిగ్గా ఐదు గంటలకు ఆ స్తంభంపై దీపం వెలిగించారు. ఈ సమయంలో ఆలయ పరిసరాలు, కొండ దిగువన ఉన్న భక్తులు హరోహర నామస్మరణను మార్మోగిస్తూ, భక్తి పారవశ్యంలో ఆనంత తాండవం చేశారు. 100 ఏళ్లకు పైగా ఎదురు చూసిన కళ, గత 40 ఏళ్లుగా సాగిన అనేక న్యాయ పోరాటాలతో దీప స్థంభంపై కార్తీక దీపం వెలగడంతో భక్తుల మురగన్‌ భక్తులు, హిందూ సంఘాల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. కోర్టు ఉత్తర్వులతో కమాండర్‌ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలో కోయంబత్తూరుకు చెందిన 130 మంది సాయుధ సీఆర్పీఎఫ్‌ జవాన్లు , బెంగళూరు నుంచి వచ్చిన అనదపు బలగాలతో ఆలయ పరిసరాల్లో 700 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ సిబ్బంది పహారాలో నిమగ్నమై ఉన్నారు. కాగా దీపం వెలిగించిన ప్రదేశం వద్దకు 50 మంది భక్తుల బృందాన్ని మాత్రమే అనుమతించారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రంలో మతసామరస్యమే లక్ష్యంగా వామపక్షాల నేతృత్వంలో చైన్నెలో నిరసన ర్యాలీ జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement