5 జిల్లాల్లో భారీ వర్షాలు | - | Sakshi
Sakshi News home page

5 జిల్లాల్లో భారీ వర్షాలు

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

● డిసెంబర్‌ 11 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ ● కడలూరు జైలుకు తరలింపు ● కరూర్‌ ఘోర రోడ్డు ప్రమాదం ● నలుగురికి తీవ్ర గాయాలు

– వాతావరణ విభాగం వెల్లడి

కొరుక్కుపేట: దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా జిల్లాలు, పశ్చిమ కనుమల జిల్లాలు, డెల్టా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరునెల్వేల్లి, తూత్తుకుడి, కన్యాకుమారి, రామనాథపురం, తెన్కాసి అనే 5 జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతోంది. ఈనేపథ్యంలో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చైన్నె వాతావరణ విభాగం తెలిపింది. అదేవిధంగా, డెల్టా జిల్లాలు, కడలూ రు, మైలాడుతురై జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చైన్నె విషయానికొస్తే, ఆకాశం మేఘామృతమై ఉంటుంది, నగరంలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

రిమాండ్‌కు టీవీకే ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌

సాక్షి, చైన్నె: మహిళా అధికారికి అసభ్యకర సందేశాలు పంపిన కేసులో అరెస్టయిన కళ్లకురిచ్చి నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌కు న్యాయస్థానం డిసెంబర్‌ 11 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో శనివారం ఉదయం ఆయన్ను కడలూరు కేంద్ర కారాగారానికి తరలించారు. జూలై నెలలో ఓ మహిళా అధికారికి ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌ అసభ్యకరమైన సందేశం పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం మీడియా, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమై విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. మరోవైపు, ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించి, 7 రోజుల్లోగా చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. అలాగే, చైన్నెకి చెందిన అన్నాడీఎంకే న్యాయవాది ఆర్‌. త్రిశూలి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మీ నారాయణన్‌, ప్రత్యేక దర్యాప్తు అధికారులను నియమించి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 23న బాధిత మహిళా అధికారి కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ షానాజ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కళ్లకురిచ్చి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే అరుళ్‌ విఘ్నేష్‌పై 5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన్ను అరెస్ట్‌ చేసిన పోలీసులు త్యాగ దుర్గం ప్రజా పనుల శాఖ కార్యాలయానికి తరలించిఅర్థరాత్రి వరకు విచారించారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయన్ను డిసెంబర్‌ 11 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించాలని ఆదేశించడంతో, కడలూరు జైలుకు తరలించారు.

ముగ్గురు అయ్యప్ప భక్తుల దుర్మరణం

సాక్షి, చైన్నె: శబరిమల అయ్యప్ప దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కరూర్‌ జిల్లా అరవకురిచి సమీపంలో శనివారం వేకువ జామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నామక్కల్‌ జిల్లా రాశిపురం తాలూకా మంగళపురానికి చెందిన మణి అలియాస్‌ మణికందన్‌ (43), ఆయన కుమారుడు హరీష్‌ (17), అదే గ్రామానికి చెందిన గోవిందన్‌ (60), ధనుష్‌ (21), సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోని పురుటి కొట్టాయికి చెందిన చిదంబరం (45), ఆయన కుమార్తె ధన్షిక (8), పళనివేల్‌ (38) కలిసి శబరిమల యాత్రకు వెళ్లారు. దర్శనం ముగించుకుని వీరంతా ఒకే కారులో స్వగ్రామాలకు తిరుగుప్రయాణమయ్యారు. శనివారం తెల్లవారుజామున 1:45 గంటల ప్రాంతంలో వీరి కారు అరవకురిచి సమీపానికి చేరుకోగానే, ఎదురుగా వస్తున్న ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి లారీ స్టెప్నీ టైరు ఊడి పడిపోయినప్పటికీ, డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మణికండన్‌ (43)తో పాటు గోవిందన్‌ (60), పళనివేల్‌ (38) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అరవకురిచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ధనుష్‌, హరీష్‌, చిదంబరం, చిన్నారి ధన్షికలను రక్షించి చికిత్స నిమిత్తం అరవకురిచిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వారిలో హరీష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కరూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప దర్శనం చేసుకుని ఇంటికి వస్తున్న భక్తులు మార్గమధ్యంలోనే మృత్యువాత పడటంతో విషాదం నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement