– టేబుల్ టెన్నిస్ బోర్డు అందజేత
సాక్షి, చైన్నె:పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా, తన క్రీడా ఆసక్తిని వెల్లడించిన ఓ దివ్యాంగ విద్యార్థి కోరికను సీఎం విజయ్ కేవలం కొన్ని గంటల్లోనే నెరవేర్చి ఆశ్చర్యపరిచారు. 10, 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తమిళగ వెట్రి కళగం ఆధ్వర్యంలో ఇచ్చే మూడో విడత ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం శుక్రవారం సాయంత్రం చైన్నెలో జరిగింది. ఈ వేడుకలో నియోజకవర్గాల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి విజయ్ నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థి అశ్విన్ 12వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించినందుకు సీఎం చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. ఆ సమయంలో అశ్విన్ తన మనసులోని కోరికను సీఎం ముందుంచాడు. తనకు పారా టేబుల్ టెన్నిస్ క్రీడపై ఎంతో ఆసక్తి ఉందని, సాధన చేసేందుకు ఒక టేబుల్ టెన్నిస్ బోర్డు సమకూరిస్తే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రికార్డులు సృష్టిస్తానని తెలిపాడు. విద్యార్థి క్రీడాస్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన విజయ్ అతని విజ్ఞప్తిపై తక్షణమే స్పందించారు. కార్యక్రమం ముగిసిన కొన్ని గంటల్లోనే, అదే రోజు రాత్రి అశ్విన్‌కు కొత్త టేబుల్ టెన్నిస్ బోర్డును సిద్ధం చేయించారు. మంత్రుల ద్వారా శనివారం అతడికి ఆ బోర్డును అందజేయించారు. తన చిరకాల క్రీడా కలను గంటల వ్యవధిలోనే నిజం చేసిన సీఎంత్రి విజయ్‌కు విద్యార్థి అశ్విన్ హృదయపూర్వక కతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులో తప్పకుండా పతకాలు గెలిచి రాష్ట్రానికి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేశాడు.


