డీఎంకే మద్దతుపై కొత్త చర్చ! | - | Sakshi
Sakshi News home page

డీఎంకే మద్దతుపై కొత్త చర్చ!

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

● స్టాలిన్‌ వివరణ ● ఆహ్వానించిన బీజేపీ ● ఇది దేశానికే ముప్పు అన్న తిరుమా

సాక్షి, చైన్నె: నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇస్తూ డీఎంకే తీర్మానం చేయడం తమిళనాట చర్చకు దారి తీశాయి. వ్యూహాత్మకంగా ఇక అడుగుల వేసే దిశగా డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వివరణ ఇవ్వగా, బీజేపీ నేత మిళిసై ఆహ్వానం పలికారు. అదే సమయంలో బీజేపీ ఉచ్చులో పడవద్దు అని ద్రవిడ కళగం డీఎంకేకు హితవు పలికింది. ఈ నిర్ణయం దేశానికి ముప్పు అని వీసీకే నేత తిరుమావళవన్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో శనివారం చైన్నెలోని అన్నా అరివాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే ఎంపీల సమావేశం జరిగింది. పార్టీ లోక్‌ సభ, రాజ్య సభ ఎంపీలు అందరూ ఈ భేటికి హాజరయ్యారు. పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన అంశాల గురించి చర్చించారు. అనంతరం ఈ భేటీలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తూనే ఈ బిల్లుకు మద్దతు పలికే విధంగా డీఎంకే స్పందించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. బిజేపీకి డీఎంకే దగ్గరవుతోందని గత కొంత కాలంగాసాగుతూ వచ్చిన ప్రచారానికి ఈ నిర్ణయం బలాన్ని చేకూర్చినట్టుగా మారింది. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఎందుకు ఇస్తన్నామో అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వివరణ ఇవ్వడం గమనార్హం.

సమగ్ర పరిశీలనతోనే..

సమగ్రంగా పరిశీలించిన తర్వాతే, తమిళనాడు ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నందున నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని పార్టీ ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలగదని ఆయన పేర్కొన్నారు.ఎంపీల సమావేశం ముగిసిన అనంతరం ఎం.కె. స్టాలిన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన డిమాండ్లను అంగీకరించే బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుంది. గత ఏప్రిల్‌లో ఈ బిల్లును మేము వ్యతిరేకించడానికి కారణమైన రెండు ప్రధాన డిమాండ్లను కొత్త బిల్లులో లిఖితపూర్వకంగా చేర్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు.

ఆహ్వానించిన బీజేపీ..

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతిచ్చిన డీఎంకేకు ధన్యవాదాలు అని బీజేపీ సీనియర్‌ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందనుండటం సంతోషకరమైన విషయంగాపేర్కొంటూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు కూడా అమల్లోకి రాబోతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు అసలైన అధికారం దక్కనున్నదని ఈ పునర్విభజన వల్ల తమిళనాడుకు మరింత మంది లోక్‌సభ సభ్యులు లభిస్తారని అన్నారు. ఇక పార్టీల మధ్య పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని, ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఏకాకిగా మిగిలిపోయిందని అని ఆమె వ్యాఖ్యానించారు.

బీజేపీ ఉచ్చులో డీఎంకే పడకూడదు

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో ఎక్కువ సీట్లు, దామాషా ప్రాతినిధ్యం అనే బీజేపీ ఉచ్చులో డీఎంకే చిక్కుకోవద్దని ద్రవిడర్‌ కళగం అధ్యక్షుడు కె. వీరమణి హెచ్చరించారు. డీఎంకే అలాంటి నిర్ణయం తీసుకుంటే, ఆ పార్టీని ఓడించాలని చూస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు అది చక్కటి అవకాశంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల వైఖరినే తమిళనాడు కూడా అనుసరించాలని, జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ఏ ప్రయత్నానికీ తావివ్వకూడదని పేర్కొన్నారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్‌ స్పందిస్తూ డీఎంకే నిర్ణయం దేశాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement