కోయంబత్తూరులో రూ. 2,300 కోట్ల స్కాం | - | Sakshi
Sakshi News home page

కోయంబత్తూరులో రూ. 2,300 కోట్ల స్కాం

Nov 27 2026 2:14 AM | Updated on Nov 27 2026 2:14 AM

● ఆడిట్‌ నివేదికతో వెలుగులోకి.. ● పన్నుల్లో మాయాజాలం

సాక్షి, చైన్నె: పన్నుల వసూలు, నిధుల వినియోగంలో జరిగిన భారీ అవకతవకల కారణంగా కోయంబత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఏకంగా రూ. 2,300 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు ప్రత్యేక ఆడిట్‌ నివేదికలో వెల్లడైంది. సమాచార హక్కు చట్టం ద్వారా సామాజిక కార్యకర్త ఎస్‌.పి. త్యాగరాజన్‌ సేకరించిన వివరాలతో ఈ భారీ కుంభకోణం బట్టబయలైంది. కోయంబత్తూరు కార్పొరేషన్‌ 2021–2026 మధ్య కాలంలో చేపట్టిన బడ్జెట్‌, ఖర్చులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించారు. ఆస్తి పన్ను, ఘన వ్యర్థాల నిర్వహణ, ఎల్‌ఈడీ లైట్ల కొనుగోలు, నిర్వహణ పనులు సహా మొత్తం 7 విభాగాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 419 పేజీల సమగ్ర నివేదికను రూపొందించారు.

ఆడిట్‌ నివేదికతో వెలుగులోకి..

సాధారణ నివాసగృహాలకు విధించే తక్కువ రేట్లనే, కర్మాగారాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలకు కూడా వర్తింపజేశారు. ఇందుకోసం అధికా రులు సంపన్నుల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఒక్క ఆస్తి పన్ను రూపంలోనే రూ.2,053 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతర అక్రమాల ద్వారా జరిగిన నష్టాలు ఇలా ఉన్నాయి: అనధికార వ్యక్తుల నుంచి అక్రమంగా ఆస్తి పన్ను వసూలు చేయడం వల్ల రూ. 274 కోట్లు, వాణిజ్య అవసరాలకు నివాస గృహాల నీటి కనెక్షన్లు ఇవ్వడం వల్ల రూ. 158.31 కోట్లు గండి పడి ఉండటం వెలుగు చూసింది. కర్మాగారాలు, విద్యాసంస్థలు, నివాస భవనాల పన్ను లెక్కల్లో తేడాల వల్ల రూ. 87.17 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇక, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్నులను వసూలు చేయకపోవడం వల్ల రూ. 82.25 కోట్లు నిల్వలో ఉండగా, ఓ సంస్థ నుంచి రావాల్సిన వడ్డీని వసూలు చేయకపోవడం వల్ల రూ. 47.92 కోట్లు నష్టం ఏర్పడి ఉండటం గమనార్హం.

అక్రమ మినహాయింపులు:

నిబంధనలకు విరుద్ధంగా ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల రూ. 34.60 కోట్లు,ఓ సంస్థ తవ్విన గుంతలను పూడ్చేందుకు, తడి మిశ్రమంతో మరమ్మతులు చేసేందుకు మున్సిపల్‌ సాధారణ నిధి నుంచి అదనంగా రూ.1.87 కోట్లు ఖర్చు చేయడం కూడా ఇందులో ఉన్నాయి. ఈ వివరాలను గురువారం విడుదల చేసిన ఆర్టీఐ కార్యకర్త ఎస్‌.పి. త్యాగరాజన్‌ మీడియా ముందు ఉంచారు. నగర పాలక సంస్థలో పన్ను మినహాయింపులు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా చేతులు మారాయని ఆరోపించారు.. కీలక పత్రాలు మాయం కాకముందే వాటిని స్వాధీనం చేసుకుని, అవినీతి నిరోధక శాఖ ద్వారా తక్షణమే విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement