మరింత ముదురుతున్న తిరుప్పరకుండ్రం వివాదం | - | Sakshi
Sakshi News home page

మరింత ముదురుతున్న తిరుప్పరకుండ్రం వివాదం

Nov 27 2026 2:14 AM | Updated on Nov 27 2026 2:14 AM

● ట్రస్టు బోర్డు చైర్మన్‌కు భద్రత పెంపు ● నేడు కోర్టు ధిక్కార కేసు విచారణ

సాక్షి, చైన్నె: తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు స్థంబం వద్ద కాకుండా ఉచ్చిపిళ్ళైయార్‌ ఆలయం వద్ద దీపం వెలిగించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టీ బోర్డు ఛైర్మన్‌ షణ్ముగసుందరం ఇంటి కి, కార్యాలయానికి పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు, ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం, సీఎం విజయ్‌ తీరుపై హిందూ మున్నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇక, అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కార కేసు శుక్రవారం విచారణకు రానున్నడం ఉత్కంఠను రేపుతున్నది.

ఛైర్మన్‌ షణ్ముగసుందరానికి పోలీసు భద్రత

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్థంబంలో కాకుండా, కొండపై ఉన్న ఉచ్చిపిళ్ళైయార్‌ ఆలయంలో కార్తీక దీపం వెలిగించినట్లు ఆలయ యంత్రాంగం ప్రకటించిన అనంతరం, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ షణ్ముగసుందరానికి ఫోన్‌, సోషల్‌ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీనికి తోడు ఆయన ఇంటి ముందు నిరసన చేపడతామని అఖిల్‌ భారత్‌ హనుమాన్‌ సేన పిలుపునిచ్చింది. దీంతో షణ్ముగసుందరం పోలీస్‌ కమిషనర్‌, తిరునగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌ రాజేంద్రన్‌, తిరునగర్‌ పాండియన్‌ నగర్‌లోని ఆయన నివాసానికి, పక్క వీధిలోని కార్యాలయానికి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే మదురై కలెక్టర్‌ బంగ్లా, మంత్రి నిర్మల్‌ కుమార్‌ నివాసం, కార్యాలయాల వద్ద సాయుధ బలగాలను మోహరించారు.

సీఎం విజయ్‌పై హిందూ మున్నాని

తీవ్ర విమర్శలు

ఈ అంశంపై హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రమణియం స్పందిస్తూ, సంకీర్ణ కూటమి దయాదాక్షిణ్యాలపై పాలన నిలబెట్టుకోవడానికి, మైనారిటీలను బుజ్జగించేందుకే సీఎం విజయ్‌ చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. దీపం వెలిగించకపోవడంపై క్షమాపణ చెప్పడం చట్టాన్ని గౌరవించకపోవడమేనని అన్నారు. కలెక్టర్‌ అధికారానికి తలొగ్గి తప్పుడు కారణాలు చెప్పారని, ఆయనకు తగిన శిక్ష విధించాలని కోరారు. ఉచ్చిపిళ్ళైయార్‌ ఆలయంలో దీపం వెలిగించడం పూజారుల అభిప్రాయం మేరకే జరిగిందని ఆలయ జాయింట్‌ కమిషనర్‌ సెల్వి చెప్పడాన్ని ఖండించారు. తమ అభిప్రాయం ఎవరూ అడగలేదని పూజారులు స్పష్టం చేశారని, భట్‌ల అభిప్రాయాలను మార్చేందుకు అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కాగా, కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు , సామాజిక కార్యకర్త జి. భానుప్రకాష్‌ రెడ్డి తరఫున తమిళనాడు సీఎం విజయ్‌కు లీగల్‌ నోటీసు జారీ అయినట్టు సమాచారం. భానుప్రకాష్‌ రెడ్డి తరఫున న్యాయవాది కె. అజయ్‌కుమార్‌ ఈ నోటీసును పంపినట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement