రూ. 100 కోట్ల పనులకు కొత్త టెండర్ కమిటీ ఏర్పాటు ఆర్థిక అధికారాలు రెట్టింపు రూ. 160 కోట్లు దాటితేనే డైరెక్టర్ల బోర్టుకు ప్రతిపాదనలు
సాక్షి, చైన్నె: టెండర్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించి, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా తమిళనాడు విద్యుత్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 100 కోట్ల వరకు విలువైన కాంట్రాక్టు పనులకు వేగంగా ఆమోదం తెలిపేందుకు బోర్డులో ఒక కొత్త టెండర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న బోర్డు స్థాయి టెండర్ కమిటీ ఆర్థిక అధికారాలను కూడా రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల జరిగిన తమిళనాడు విద్యుత్ బోర్డు 141వ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఉన్న క్యాపిటల్ హై–లెవల్ టెండర్ కమిటీకి, బోర్డ్–లెవల్ టెండర్ కమిటీకి మధ్య మరో కొత్త కమిటీని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ విద్యుత్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సవిత తాజాగా అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
కొత్త కమిటీ స్వరూపం, అధికారాలు..
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఫైనాన్స్) అధ్యక్షతన జేఎంటీ ఫైనాన్షియల్ స్టేటస్ టెండర్ కమిటీ పేరుతో ఈ నూతన కమిటీ పనిచేయనుంది. ఇందులో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (డిస్ట్రిబ్యూషన్), డైరెక్టర్ (ఫైనాన్స్), డైరెక్టర్ (డిస్ట్రిబ్యూషన్)లతో పాటు సంబంధిత టెండర్ ప్రతిపాదనను సమర్పించే ప్రిన్సిపల్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి రూ. 50 కోట్ల వరకు విలువైన పరికరాల కొనుగోలు టెండర్లను ఖరారు చేసే అధికారం ఉంటుంది. అలాగే రూ. 100 కోట్ల వరకు విలువైన కాంట్రాక్టు పనులకు నేరుగా ఆమోదం తెలపవచ్చు. మరోవైపు, ఇప్పటికే ఉన్న బోర్డు స్థాయి టెండర్ కమిటీ ఆర్థిక పరిమితులను కూడా భారీగా పెంచారు. పరికరాల కొనుగోలు టెండర్ల ఆమోద పరిమితిని రూ. 40 కోట్ల నుంచి రూ. 80 కోట్లకు పెంచారు. కాంట్రాక్టు పనుల ఆమోద పరిమితిని రూ. 80 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు రెట్టింపు చేశారు. ఈ పెంచిన పరిమితులకు మించిన టెండర్లను మాత్రమే తుది ఆమోదం కోసం విద్యుత్ బోర్డు డైరెక్టర్ల సమావేశం ముందుకు తీసుకువెళ్తారు. అయితే, కింది స్థాయిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపర్‌వైజింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ , క్యాపిటల్ హై–లెవల్ టెండర్ కమిటీలకు ప్రస్తుతం ఉన్న టెండర్ అధికారాలలో (రూ. 10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు) ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.


