సాక్షి, చైన్నె : చైన్నెలోని జెమ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పి. సెంథిల్ నాథన్ భారతదేశంలోనే అతిపెద్ద మిని మల్ యాక్సెస్ సర్జన్ల సంఘమైన అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎంఏఎస్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.కొత్త విజన్.. కొత్త ప్రయాణం.. మరింత బలమైన ఏఎంఏఎస్‌ఐ అనే నినాదంతో తన భవిష్యత్తు వ్యూహాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. మాజీ అధ్యక్షుడు బరోడాకు చెందిన డాక్టర్ కల్పేష్ జానీ నుంచి డాక్టర్ సెంథిల్ నాథన్ ఈ బాధ్యతలను స్వీకరించారు. తన పదవీకాలంలో సంస్థ అభివృద్ధికి , ల్యాప్రోస్కోపిక్, మినిమల్ యాక్సెస్ సర్జరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు డాక్టర్ సెంథిల్ నాథన్ 8 అంశాలతో కూడిన ప్రణాళికను ఈసందర్భంగా ప్రకటించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ప్రాధాన్యత
ఈ సందర్భంగా డాక్టర్ సెంథిల్ నాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న సర్జన్లకు ప్రాక్టికల్ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వసతులు కల్పించడమే తమ కొత్త నాయకత్వ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. దీని ద్వారా సామాన్యులకు కూడా అధునాతన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అంతర్జాతీయ ల్యాప్రోస్కోపిక్ అసోసియేషన్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని కొత్త సాంకేతికతను వైద్యులకు అందించనున్నట్టు వివరించారు.


