తమిళసినిమా: జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తగప్పన్. మలయాళ నటి రజీషా విజయన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కె కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కిడా చిత్రం ఫేమ్ ఆర్.వెంకట్ కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి మార్షల్ రాబిన్సన్ సంగీతాన్ని, ఎం సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మదురై నేపథ్యంలో సాగే తండ్రి కొడుకులు అనుబంధాన్ని, కుటుంబ భావోద్వేగాలను ఆవిష్కరించే విభిన్న గ్రామీణ కథాచిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇది ఇప్పటివరకు నటుడు జీవా నటించిన చిత్రాలలో విభిన్నంగాను, ఆయన కేరీర్‌లో ముఖ్యమైన చిత్రంగాను నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా జాతీయ అవార్డు గ్రహీత నటి రజీషా విజయన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ ముందుగా 45 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు, అయితే జీవా అందించిన సహకారం, ఆయన అంకితభావంతో నటించడంతో 40 రోజుల్లోనే సంపూర్ణంగా పూర్తి చేసినట్లు చెప్పారు. అదే విధంగా ఇతర నటినట్లు సాంకేతిక వర్గం, మదురై గ్రామ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుగుతున్నాయని, డిసెంబర్‌లో తగప్పన్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.


