సాక్షి, చైన్నె: చైన్నె గ్రేటర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పౌరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఒక్క రోజులో 25 టన్నుల పాత సోఫాలు, పరుపులను సిబ్బంది సేకరించి తొలగించారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు చైన్నె కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. చైన్నె నగర ప్రజలు ముందుగా ఇచ్చే సమాచారం ఆధారంగా ఇకపై ప్రతి శనివారం వారి ఇళ్ల నుంచి పాత సోఫాలు, పరుపులు, చెక్క పీఠాలు, ఫర్నిచర్ , పాత దుస్తులు వంటి ఘన వ్యర్థాలను సేకరించి పారవేసే ప్రత్యేక కార్యక్రమాన్ని గతేడాది అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై సరైన అవగాహన అన్నది లేదు. దీంతో తాజా 74 మంది అందించిన సమాచారం మేరకు 25.2 టన్నుల పాత వస్తువులను సేకరించారు. వీటిని తరలించడానికి 35 వాహనాలను ఉపయోగించారు. సేకరించిన వ్యర్థాలను కొడుంగైయూర్ లోని ఇన్‌సినిరేషన్ ప్లాంట్‌కు తరలించి, వైజ్ఞానిక పద్ధతిలో కాల్చి బూడిద చేశారు.
సేవలను ఎలా పొందాలి..?
ప్రతి వారం శనివారం అందించే ఈ ఉచిత సేవను పొందాలనుకునే చైన్నె ప్రజలు ముందుగానే కార్పొరేషన్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది: చైన్నె కార్పొరేషన్ నమ్మ చైన్నె యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలాగే హెల్ప్‌లైన్ నంబర్ – 1913 నంబర్‌కు కాల్ చేసి వివరాలు నమోదు చేయవచ్చు. అంతే కాకుండా వాట్సాప్ నంబర్ – 94450 61913 మెసేజ్ పంపవచ్చు. రిజిస్టర్ చేసుకున్న వారి ఇళ్లకు ప్రతి శనివారం కార్పొరేషన్ సిబ్బంది నేరుగా వచ్చి పాత సోఫాలు, పరుపులు, ఫర్నిచర్ , దుస్తులను ఉచితంగా సేకరించి, సురక్షితంగా పారవేస్తారు. కాబట్టి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. కాగా రోడ్లపై ఇలాంటి వస్తువులను ఎక్కడ బడితే అక్కడ వేయడాన్ని అడ్డుకునే దిశగా కార్పొరేషన్ వర్గాలు తాజాగా ఈ సేవలను విస్తృతం చేశారు. అలాగే ఇళ్ల నుంచి రోజూ సేకరించి చెత్తను ఇక, మగ్గనివి, మగ్గేవి అని విభజించి కార్పొరేషన్ సిబ్బందికి ప్రజలే అందజేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించే గృహ యజామనులకు ఇక, జరిమానాలమోత మంగళవారం నుంచి మోగే అవకాశాలుఉన్నాయి.


