తిరువళ్లూరు: వియ్ ద లీడర్స్ అధినేత అన్నామలై పిలుపు మేరకు తిరువళ్లూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో సంస్థ నేతలు దాదాపు పది వేల తాటి విత్తనాలను నాటారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పని చేసిన ఐపీఎస్ అధికారి అన్నామలై ఇటీవల ఆ పార్టీ నుంచి వైదొలగి కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదట వియ్ ద లీడర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి తద్వారా సభ్యత్వ నమోదును చేపట్టారు. ఇటీవల డ్రగ్స్‌కు రహిత తమిళనాడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలను అన్నామలై మద్దతుదారులు నిర్వహించారు. ఈక్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కరకట్ట వద్ద తాటి విత్తనాలను నాటాలని పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాకు చెందిన సంస్థ నేతలు లయన్ పన్నీర్‌సెల్వం, పాండూరు శేఖర్, పళణి తదితరుల నేతృత్వంలో తాటి విత్తనాలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాండూరు, రామంజేరి, తోమూరు, మావూరు, పోలీవాక్కం, సత్రం తదితర ప్రాంతాల్లో సుమారు పది వేల తాటి విత్తనాలను నాటారు.


