ఏపీ మద్యం బాటిళ్లు స్వాధీనం
–యువకుడి అరెస్టు
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని పొన్పాడి చెక్‌పోస్టు వద్ద ఆర్కేపేట మధ్యపాన రహిత పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేశారు. ఆంధ్రాలోని నగరి నుంచి తిరుత్తణి వైపు బైకులో వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీరు బాటిళ్లు ఉన్నట్టు గుర్తించి మొత్తం 24 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యపాన నిషేధిత విభాగం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు అరక్కో ణం సమీపంలోని వలర్పురానికి చెందిన జయపాల్(27) అని తేలింది. అతడు సరిహద్దులోని ఆంధ్రా మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసిన బీరు అరక్కోణంకు తరలిస్తున్నట్లు తేలింది.
27 కిలోల గుట్కా ప్యాకెట్లు సీజ్
–ఇద్దరి అరెస్ట్
–నిందితుల్లో ఒకరు మాజీ సైనికుడు
తిరుత్తణి: గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న మాజీ సైనికుడితో సహా ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని ఆంధ్రా సరిహద్దు పొన్పాడి చెక్‌పోస్టు వద్ద తిరుత్తణి పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు చేశారు. ఆంధ్రా నుంచి తిరుత్తణి వైపు వచ్చిన బైక్‌ను ఆపి తనిఖీ చేశారు. నిషేధిగ గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్టు గుర్తించి, బైక్‌లో వస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 కిలోల గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక విచారణలో అరక్కోణం ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు నాగరాజు(4), విశ్వనాధన్(45) అని తేలింది. కేసు నమోదు చేసిన తిరుత్తణి ఇన్‌స్పెక్టర్ శివకుమార్ వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
గుట్కా విక్రేత అరెస్ట్
తిరుత్తణి: పట్టణంలోని కిరాణా దుకాణాలు, చిల్లర వ్యాపార దుకాణాలు, టీ అంగళ్లలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం పలు దుకాణాలపై దాడులు చేశారు. కమల ధియేటర్ వద్ద రాజేంద్ర నాయుడు (45) తన దుకాణంలో దాచివుంచిన గుట్కా, పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసి అరెస్ట్ చేశారు.
అధిక ధరలకు టాస్మాక్
మద్యం విక్రయం
–నిందితుడి అరెస్ట్
తిరుత్తణి: పట్టణంలో టాస్మాక్ మద్యం అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందడంతో ఆదివారం పలుచోట్ల తనిఖీలు చేశారు. కమల ధియేటర్ కూడలిలో గోడౌన్‌పై దాడులు చేశారు. తిరుత్తణి బాలాజీ నగర్‌కు చెందిన వెంకటేశన్(52) అక్కడ టాస్మాక్ మద్యం నిల్వ వుంచి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసి అరెస్టు చేశారు.
40 సవర్ల నగలు,
రూ. 40 లక్షలు దోపిడీ
తిరువొత్తియూరు: నామక్కల్ జిల్లా పరమతివేలూరు తాలూకా పిలికల్పాలయం సినిమా కొట్టాయ్ మేడు ప్రాంతం నుంచి చిన్నమరుదూర్ వెళ్లే రహదారి సమీపంలో వైరవన్ (60) అనే బెల్లం వ్యాపారి నివసిస్తున్నారు. ఈయన భార్య సుమతి (55). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహాలు కావడంతో, ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి వైరవన్, ఆయన భార్య సుమతి భోజనం ముగించుకుని ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో 4 గురు ముసుగులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు కాంపౌండ్ గోడ దూకి లోపలికి వచ్చారు. ఆ సమయంలో శబ్దం విని వైరవన్, ఆయన భార్య సుమతి నిద్ర లేచి వచ్చేసరికి, తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన ఆ నలుగురు ముసుగు దొంగలు భార్యాభర్తలిద్దరినీ బంధించారు ఆపై ఆ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు, నగలు ఎక్కడ ఉన్నాయి బెదిరించారు. దానికి వారు సమాధానం చెప్పకపోవడంతో, వైరవన్‌ను కత్తితో గాయపరిచారు. అనంతరం దంపతులిద్దరినీ గట్టిగా కట్టేసి, ఇంట్లోని బీరువాను పగులగొట్టారు. అందులో ఉన్న 40 సవర్ల బంగారు నగలు మరియు రూ. 40 లక్షల నగదును దోచుకుని, ఆ గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు.
బాలికకు లైంగిక వేధింపులు
– పోక్సో కేసులో యువకుడి అరెస్టు
అన్నానగర్: అవడి పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న 15 ఏళ్ల బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. ఆమె తరచుగా తల్లిదండ్రులపై కోపగించుకుని, బంధువుల ఇంటికి వెళ్లిపోయేది. ఆగస్టు 5వ తేదీ సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయిన ఆ బాలిక సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు లైంగిక వేధింపుల ఘటన గురించి చెప్పి ఏడ్చిందని తెలుస్తుంది. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు పట్టాబీరామ్ ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు పలు కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. దర్యాప్తు మొదటి దశలో, ఆ అమ్మాయికి అవడి సమీపంలోని కోసవన్ పాలయం ప్రాంతానికి చెందిన రామ్‌కుమార్ (27)తో పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని, ఆ అమ్మాయి గత 10 రోజులుగా రామ్‌కుమార్‌తో కలిసి ఉన్నప్పుడు, అతను ఆమెను నిరంతరం లైంగికంగా వేధించినట్లు తెలుస్తుంది. దీని తర్వాత, పట్టాబీరామ్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలిసులు పోక్సోతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం సాయంత్రం రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.


