వేలూరు: వేలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ప్రజా విన్నపాల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వచ్చి వినతిపత్రాలు సమర్పించుకున్నారు. ఈ వినుతులపై వెంటనే విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని సంబంధిత అఽధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా అర్హులైన దివ్యాంగులకు అక్కడిక్కడే సంక్షేమ పథకాలు అందజేశారు. మొత్తం 69 మంది దివ్యాంగులకు వికలాంగుల సంక్షేమ శాఖ అద్వర్యంలో రూ: 4.14 లక్షలు విలువ చేసే పథకాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వాటిపై వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. ఈ సందర్బంగా మేల్‌మలయనూరు గ్రామానికి చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తాము ఈశ్వరన్ ఆలయ వీధిలో సుమారు 50 సంవత్సరాలుగా సుమారు 30 కుటుంబాలు జీవిస్తున్నామని అయితే తమకు ఇంటి పట్టాలు ఇవ్వడంలో అఽధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వీటిపై పలు మార్లు అధికారులకు వినతీ పత్రాలు సమర్పించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు విచారణ జరిపి తమకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు.


