తిరువళ్లూరు: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రారంభదశలోనే లోతైన పరిశోధనలు నిర్వహించి పట్టు సాధించాలని అనలిస్టు, కెరీర్ సలహదారుడు జయప్రకాష్ ఎ. గాంధీ సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎండీ కళాశాలలో నూతన విద్యార్థులను ఆహ్వానించే కార్యక్రమం కళాశాల ఛైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేరీర్ అనలిస్ట్ జయప్రకాష్ గాంధీ హాజరయ్యారు. కళాశాల వైస్ ఛైర్మన్ ఆర్‌ఎం కిషోర్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి నేటి వరకు పడిన కష్టం వృథాగా పోకుండా ఇంజినీరింగ్‌లో ఉన్నత మార్కులు సాధించి సబ్జెక్టుపై పట్టు సాధించాలని సూచించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. దీంతో పాటూ జర్మనీ, జపనీస్, మాండరిన్ లాంటి భాషను నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ అన్బుచెళియన్, కళాశాల కార్యదర్శి యలమంచి ప్రధీప్, సలహాదారుడు మనోహరన్, డాక్టర్ పళణీస్వామి డీన్ డాక్టర్ త్యాగరాన్, డైరెక్టర్ జ్యోతినాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొదటి సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలను అందజేసి వారిని కళాశాలకు ఆహ్వానించారు.


