– ముక్కలుగా నరికి నీటి ట్యాంక్‌లో పడేసిన వైనం
సేలం: తమిళనాడులోని సేలంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఇంటి డాబాపై ఉన్న నీటి ట్యాంక్‌లో పడేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సేలం జిల్లా అరిసిపాలయంలోని గుణపాలన్ రామస్వామి వీధిలోని ఒక ఇంట్లో పూజారి రమేష్ నివసిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి తంజావూరు, కుంభకోణం పర్యటనకు వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం ఆయన ఇంట్లో టాప్ విప్పగా నీటి నుంచి తీవ్ర దుర్వాసన వచ్చింది. అనుమానంతో రమేష్ తన కుమారుడితో కలిసి ఇంటి డాబాపైకి వెళ్లి నీటి ట్యాంక్‌ను పరిశీలించగా, అందులో రెండు అనుమానాస్పద మూటలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీటి ట్యాంక్ నుంచి ఆ మూటలను బయటకు తీశారు.
ముక్కలుగా శరీర భాగాలు..
మూటలను విప్పి చూడగా ఒక మహిళ శరీర భాగాలను ముక్కలుగా నరికి ఉండటాన్ని గుర్తించారు. ఒక మూటలో చేతులు, కాళ్లు, మరో మూటలో తల, ఛాతీ భాగం లభ్యమయ్యాయి. పక్కనే ఉన్న మరొక ఇంటి నీటి ట్యాంక్ సమీపంలో ఆ మహిళ నడుము భాగం లభించింది. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితురాలి చేతిపై ‘గణపతి’ అనే పేరుతో పాటు గణేశుడి టాటూ (పచ్చబొట్టు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన మహిళ ఎవరు? ఈ దారుణానికి ఒడిగట్టినది ఎవరు? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.


