మహిళల ఖాతాల్లో రూ.1000 | - | Sakshi
Sakshi News home page

మహిళల ఖాతాల్లో రూ.1000

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● బ్యాంక్‌లో జమ చేసిన ప్రభుత్వం ● సీఎం నిర్ణయంపై మహిళల ఆనందం ● పలు శాఖల అధికారులతో సమీక్ష ● పారిశ్రామికవేత్తలతో భేటీ

న్యూస్‌రీల్‌

సాక్షి, చైన్నె: గత ప్రభుత్వ మగళీర్‌ ఉరిమై తిట్టం పథకం మేరకు శుక్రవారం మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.1000 నగదును జమ చేశారు. సీఎం విజయ్‌ గత ప్రభుత్వ పథకాన్ని కొనసాగించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. డీఎంకే హయాంలో ఈ పథకం మహిళలో విస్తృత ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ప్రతినెలా 15వ తేదీ 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. ఈ పథకాన్ని అస్త్రంగా చేసుకుని మహిళలకు తాము అధికారంలోకి వస్తే రూ.2 వేలు ఇస్తామని డీఎంకే, అన్నాడీఎంకేలో ప్రకటించాయి. ఇక, టీవీకే విజయ్‌ అయితే, రూ.2,500 ఇస్తామన్నారు. తాజాగా ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రూ.2,500 ప్రస్తుతం బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం ఆర్థిక భారంగా ప్రభుత్వానికి మారింది. దీంతో ఈ పథకం పునర్‌వ్యవస్థీకరిస్తామని, అంతవరకు గత ప్రభుత్వం అమలు చేసినట్టుగా రూ. 1000 అందజేస్తామని సీఎం విజయ్‌ ప్రకటించారు. ఇందుకనుగుణంగా లబ్ధిదారులైన మహిళల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.1000 నగదు శుక్రవారం జమ చేశారు. దీంతో సర్వత్రా మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. రూ.2,500 మాట పక్కన పెడితే, కనీసం రూ.1000 జమ కావడం తమకు ఊరటేనని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

సామాన్యుడిలా సీఎం విజయ్‌

ముఖ్యమంత్రి విజయ్‌ తన పనితీరుతో సచివాలయ అధికారులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకే సచివాలయానికి చేరుకుని, సాయంత్రం 5 గంటల వరకు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత ముఖ్యమంత్రులు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లడం లేదా బయట నుంచి తెప్పించుకోవడం చేసేవారు. కానీ, విజయ్‌ ప్రతిరోజూ తన ఇంటి నుంచే భోజనాన్ని వెంట తెచ్చుకుంటున్నారు. అధికారుల మాదిరిగానే తన చాంబర్‌లోనే భోజనం ముగించి వెంటనే విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఆయన క్రమశిక్షణను చూసి అధికారులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం విజయ్‌ ఫొటో తప్పనిసరిచేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేశారు. ఈ ఫోటోను తప్పనిసరిగా అన్ని కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఇదిలాఉండగా ప్రతిరోజూ విజయ్‌ సచివాలయం నుంచి నీలాంకరైలోని తన నివాసానికి 17కి.మీ దూరం వెళ్లి రావాల్సి ఉంది. ఈమార్గంలో ఆయన భత్రకు 400 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈమార్గం నిత్యం రద్దీతో ఉండడంతో టాఫ్రిక్‌ కష్టాలు ఎదురవుతున్నాయి. విజయ్‌ను చూసేందుకు ఈ మార్గంలో జనం ఎగబడుతున్నారు. ఈపరిణామాల దృష్ట్యా, సీఎం విజయ్‌ తన మకాంను సచివాలయానికి సమీపంలో ఉన్న పట్టినంబాక్కం నివాసం లేదా, మరింత దగ్గరగా మార్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.

పెట్టుబడులే లక్ష్యం

సచివాలయంలో పారిశ్రామిక రంగ ప్రముఖులతో సీఎం విజయ్‌ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు శంకర్‌ వానవరాయర్‌ నేతృత్వంలో ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే,రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి సంబంధించిన కొత్త పెట్టుబడులను ఆకర్షించే వ్యూహాలపై చర్చలు జరిగాయి. బీఎండబ్ల్యూ, టీవీకేఎస్‌, హడ్సన్‌ మోటార్స్‌ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. అలాగే, వ్యవసాయం, నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలాశయాలలో నీటి నిల్వ, రిజర్వాయర్ల పరిఽస్థితి, ఈ సీజన్‌లో వరి సాగుకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement