పీఠం కోసం హోరాహోరీ | - | Sakshi
Sakshi News home page

పీఠం కోసం హోరాహోరీ

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● అన్నాడీఎంకేలో ఈపీఎస్‌ వర్సెస్‌ సీవీఎస్‌ ● రంగంలోకి శశికళ ● గ్రూప్‌ల వారీగా మంతనాలు జోరు

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయభాస్కర్‌ ఒక వర్గంగా ఏర్పడి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పళణి స్వామిని పార్టీ అధికార గద్దె నుంచి దించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. దీంతో అన్నాడీఎంకే పీఠం సమరం హోరాహోరీగా మారినట్లైంది. అదే సమయంలో శశికళ సైతం రంగంలోకి దిగారు.

రెండుగా చీలిన అన్నాడీఎంకే పార్టీ

ఆవిర్భావ కాలం నుంచి అన్నాడీఎంకేలో చీలిక కొత్తేమీ కాదు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటమితో అన్నాడీఎంకేలో రెండు వర్గాలుగా చీలిపోయిన ఎమ్మెల్యేలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీలో పార్టీ పక్ష నేతగా ఎస్పీ వేలుమణిని ఎన్నుకున్నట్లు ఓ శిబిరం ప్రకటించింది. మరో శిబిరం పళణిస్వామి వైపే మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు ఉన్నట్టుగా మరో శిబిరం ప్రకటించింది.

రంగంలోకి శశికళ?

ఈ అంతర్గత పోరును ఆసరాగా చేసుకుని, పార్టీని మళ్లీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి శశికళ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సంకేతాలు వెలువడడం మరో ట్విస్టుగా మారింది. పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య పోరు పార్టీని ఎటు వైపు తీసుకెళ్తుందోనని(బాటం)క్యాడర్‌ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శశికళ సైతం పావులు కదుపుతుండడంతో మున్ముందు అన్నాడీఎంకే ధారావాహిక ఎపిసోడ్‌లు ఎలాంటి మలుపులు తిప్పనున్నాయో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దయచేసి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే ప్రధాన కార్యదర్శి, ఎంపీ రవికుమార్‌ సీఎం విజయ్‌కు సూచించడం గమనార్హం. అన్నాడీఎంకేలో అంతర్గత సమరం నేపథ్యంలో పరిణామాలు అనర్హత వేటు దిశగా పయనించిన పక్షంలో కొత్త సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు సైతం స్పందిస్తూ, మాజీ మంత్రులను రక్షించే విధంగా వ్యవహరించ వద్దని విజయ్‌ను హెచ్చరించడం కొసమెరుపు. ఇక ఇరు తరఫు ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేత, విప్‌ పదవుల కోసం ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని చట్టపరంగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ శుక్రవారం ప్రకటించారు.

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీవీ షణ్ముగం వర్గం అనూహ్యంగా తమిళ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడంతో అన్నాడీఎంకే మళ్లీ ముక్కలైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన పళనిస్వామి తిరుగుబాటు దారులైన వేలుమణి, షణ్ముగం, విజయభాస్కర్లను వారి జిల్లా కార్యదర్శి పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరి చర్యలన్నీ వెన్నుపోటుతో సమానమని పళణి అభివర్ణించారు. కేవలం మంత్రి పదవుల కోసమే వీరి వ్యూహాలు అని ధ్వజమెత్తారు. దీంతో చైన్నె రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైని చేజిక్కించుకునేందుకు షణ్ముగం వర్గం ప్రయత్నిస్తుందన్న సమాచారంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై షణ్ముగం స్పందిస్తూ పార్టీ కార్యాలయం తమకు దేవాలయం వంటిది. చట్టబద్ధంగా మేమే నిజమైన కార్యకర్తలం అని నిరూపించుకున్నాకే అక్కడ అడుగు పెడతాం అని వ్యాఖ్యానించారు. ఓ వైపు సీవీ షణ్ముగం, మరో వైపు పళణిస్వామి వ్యాఖ్యల తూటాలను పేల్చుతుండడంతో వివాదం వారి ఇళ్ల వద్దకు చేరవచ్చు అన్న సంకేతాలు బయలుదేరాయి. దీంతో ఇద్దరు నేతల ఇంటి పరిసరాలలో సైతం పోలీసులు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వెన్నుపోటు అన్న పళణిస్వామి

గవర్నర్‌ గడప తొక్కనున్న

పళనిస్వామి

మరోవైపు, టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో గురప్రు బేరాలు జరిగాయని పళనిస్వామి వర్గం ఆరోపిస్తున్నది. ఇందుకు నిదర్శనం తమ ఎమ్మెల్యేలు టీవీకే వైపుగా చేరడాన్నే పరిగణించారు. ఇప్పటికే గవర్నర్‌ కార్యాలయానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా గవర్నర్‌ అర్లేకర్‌కు ఫిర్యాదును స్వయంగా అందించేందుకు పళణి సన్నద్ధం అవుతున్నారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ జె.సి.డి.ప్రభాకర్‌ను కోరిన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లే దిశగా ముందుడుగు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకేను చేజిక్కించుకునే దిశగా సీవీ షణ్ముగం శిబిరం వ్యూహాలకు పదును పెట్టినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement