59 ఏళ్ల తర్వాత మంత్రి వర్గంలోకి.. | - | Sakshi
Sakshi News home page

59 ఏళ్ల తర్వాత మంత్రి వర్గంలోకి..

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● విజయ్‌ మాట నిలబెట్టుకున్నారు ● కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళ వెట్రి కళగం నేత, సీఎం విజయ్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు. 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మంత్రి వర్గంలో చేరబోతున్నారని ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ టీవీకేకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, వీసీకేలు బయటి నుంచి మద్దతు ఇస్తుంటే, కాంగ్రెస్‌ మాత్రం అధికారంలో వాటాను ఆశించింది. దీంతో ఆ పార్టీకి మంత్రి పదవి గ్యారంటీ అన్న చర్చ ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చాక్జ్‌ గిరీష్‌ చోడన్కర్‌ ఢిల్లీ వెళ్లారు. అక్కడి పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో సమావేశమయ్యారు. ఈ ఐదుగురిలో ఎవరిని మంత్రి పదవి వరించనున్నదో అన్న చర్చ సాగుతూ వచ్చింది. ఈ సమయంలో మాణిక్యం ఠాకూర్‌ ట్వీట్‌ ప్రాధాన్యతకు శుక్రవారం దారి తీసింది.

కొత్త చరిత్ర

తమిళనాడులో కొత్త చరిత్ర మొదలైందని ఆయన ట్వీట్‌ చేశారు. గతంలో అధికారంలో వాటా ఇవ్వబోమని ప్రకటించిన వారికి ప్రజలే తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఖద్దర్‌ ధరించిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రకటించారు. ఇది తనలాంటి వేలాది మంది కార్యకర్తలకు ఎంతో ఉద్వేగభరితమైన క్షణంగా అభివర్ణించారు. తమిళనాడును 36 శాతం కమిషన్‌ రాజకీయాల నుంచి విముక్తి చేసి, అవినీతిలేని పాలన వైపు నడిపించాలని కొత్త ప్రభుత్వం కోటి ఆశలతో ముందుకు సాగుతోందన్నారు. 1967లో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ద్రవిడ పార్టీల హయాంలో ఆ పార్టీకి ఎప్పుడూ మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. అయితే, ఈసారి ఎన్నికల్లో డీఎంకే– కాంగ్రెస్‌ బంధంలో వీడిన నేపథ్యంలో విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు తెలపడం చకచకా జరిగిపోయాయి. త్వరలోనే విడుదల కానున్న అధికారిక మంత్రివర్గ జాబితాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇద్దరికి కీలక శాఖలు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు మాణిక్యం ఠాకూర్‌ ట్వీట్‌ మరింత బలాన్ని ఇచ్చినట్లైంది.

Advertisement
 
Advertisement
Advertisement