సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతూ, దానిని రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. 2026–27 విద్యాసంవత్సరానికి నీట్ పరీక్షను రద్దు చేసి, ప్లస్‌టూ మార్కుల ఆధారంగానే వైద్యవిద్య సీట్లను భర్తీ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ తక్షణమే ఆర్డినెన్‌న్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
నీట్ వ్యవస్థలో లోపాలు..స్టాలిన్ ఆరోపణలు
తన లేఖలో స్టాలిన్ నీట్ పరీక్షా విధానంపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2026 నీట్ పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ అక్రమాల్లో 45 మంది అరెస్టయ్యారని, 22.8 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని పేర్కొన్నారు. 2015లో ఏఐపీఎంటీ నుంచి 2024 వరకు నీట్ పరీక్షలో ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయని, బ్లూటూత్ పరికరాల వినియోగం, డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించడం వంటివి సర్వసాధారణం అయ్యాయని వివరించారు. నీట్ అనేది కేవలం ధనవంతులకు, కోచింగ్ సెంటర్లకు మాత్రమే మేలు చేసేలా ఉందని స్టాలిన్ ఆరోపించారు. దేశంలో కోచింగ్ సెంటర్ల వ్యాపారం రూ.70 వేల కోట్లకు చేరుకుందని, భారీగా డబ్బు ఖర్చు చేసి శిక్షణ పొందనిదే ఈ పరీక్షలో నెగ్గడం అసాధ్యమని ఆయన అన్నారు.
గ్రామీణ విద్యార్థులకు శాపం
నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు శాపంగా మారిందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సిలబస్‌లో చదివే విద్యార్థులు సీబీఎస్‌ఈ ఆధారిత నీట్ పరీక్షను ఎదుర్కోలేకపోతున్నారని, ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో తమిళనాడులో అమలు చేసిన ప్లస్‌టూ మార్కుల ఆధారిత వైద్య సీట్ల భర్తీ విధానం అత్యంత పారదర్శకమైందని, దానివల్లే రాష్ట్రంలో వైద్య రంగానికి బలమైన పునాదులు పడ్డాయని గుర్తు చేశారు. నీట్ పరీక్ష వలన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి స్వస్తి పలకాలని ప్రధానిని లేఖలో కోరారు.


