మదురై కార్పొరేషన్‌లో రూ.400 కోట్ల అవినీతి | - | Sakshi
Sakshi News home page

మదురై కార్పొరేషన్‌లో రూ.400 కోట్ల అవినీతి

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● విచారణ జరిపిస్తామన్న మంత్రి నిర్మల్‌కుమార్‌

సాక్షి, చైన్నె: గత నాలుగేళ్లలో మదురై కార్పొరేషన్‌న్‌లో రూ.400 కోట్ల మేర అవినీతి జరిగిందని, ప్రజల సొమ్మును దోచుకున్నారని మంత్రి సి.టి.ఆర్‌. నిర్మల్‌కుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మదురైలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీవీకే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి విజయ్‌ అనేక నిర్మాణాత్మక పనులు చేస్తున్నారని ప్రశంసించారు. సింగపెన్‌ పథకం ద్వారా మహిళల రక్షణకు, టాస్మాక్‌ దుకాణాల తగ్గింపునకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పాత ప్రభుత్వ పథకాలైన మగళీర్‌ ఉరిమై తిట్టం వంటి పథకాలు కొనసాగుతాయని, వచ్చే బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

మదురై అభివృద్ధిపై దృష్టి

మదురైలో మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో జరిగిన రూ.400 కోట్ల అవినీతిని అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నీట్‌ పరీక్ష ఒక పెద్ద వ్యాపారంగా మారిందని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒక పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందని, దీనివలన లక్షలాది మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. నీట్‌ రద్దు చేయాలన్నదే తమ ప్రభుత్వ నిశ్చితాభిప్రాయమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ప్రస్తుతం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి రహిత తమిళనాడును నిర్మించడమే ముఖ్యమంత్రి విజయ్‌ లక్ష్యమని, ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement