కోలాహలం..
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం గంగయమ్మన్ ఆలయ జాతరను పురస్కరించుకొని అమ్మన్ శిరస్సు జాతర శుక్రవారం ఉదయం కోలాహలంగా జరిగింది. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగయమ్మన్ జాతర ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీ. ఇందులోబాగంగా శుక్రవారం ఉదయం ముత్తాలమ్మన్ ఆలయంలోని అమ్మన్ శిరస్సుకు ప్రత్యేక పూజలు చేసి భక్తుల కోలాహలం మధ్య శిరస్సు ఊరేగింపుగా తీసుకొచ్చి పాలారు నది ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహానికి అమర్చారు. ఊరేగింపులో ఓంశక్తి భక్తులతో పాటు, భక్తులు వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా విపరీతమైన ఎండ తీవ్రతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతరకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు నీరు, మజ్జిగ, అంబలితో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జాతరలో దేవదాయశాఖ ఆలయ ఈఓ శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ నిత్య, ఆలయ ధర్మకర్త ఆర్‌పీఎస్ సంపత్, ఆర్‌జేఎస్ కార్తికేయన్ నిర్వాహకులు భక్తులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ శివరామన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగింపులో రాత్రి బాణసంచా వేడుకలను ఏర్పాటు చేశారు.


