ఐటీతో నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

ఐటీతో నిర్బంధం

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

● సెల్వ పెరుంతొగై ఫైర్‌ ● కార్తీ కార్యాలయంలో సోదాలు

సాక్షి, చైన్నె : ఆదాయ పన్ను శాఖ ద్వారా తనను ప్రచారంలోకి వెళ్లనివ్వకుండా నిర్బంధించారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సెల్వ పెరుంతగై నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ విస్తృత దాడులలో నిమగ్నమైంది. ఈ దాడుల రూపంలో తనను ప్రచారంలోకి వెళ్లనివ్వకుండా నిర్భంధంలో ఉంచారని వెలుపలకు వచ్చిన సెల్వ పెరుంతొగై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

మమ్మల్ని అణచివేయలేరు

శ్రీపెరంబుదూర్‌ లోని తన నివాసంతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయడాన్ని సెల్వపెరుంతగై తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచార చివరి దశలో తనను కట్టడి చేసేందుకే కేంద్రం ఈ కుట్రకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తమిళనాడు పర్యటనకు వస్తున్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు స్వాగతం పలికి, పలు బహిరంగ సభలకు (కులచల్‌, నాంగునేరి తదితర ప్రాంతాలకు) తనే స్వయంగా తీసుకెళ్లాల్సి ఉందని వివరించారు. అయితే, తాను రాహుల్‌ గాంధీని కలవకుండా ఉండేలా, విమానాలన్నీ వెళ్లిపోయే వరకు ఇంట్లోనే నిర్భందించి ఆ తర్వాత అధికారులు వెనుతిరిగారని ఆరోపించారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టి, ప్రచారం చేయకుండా గృహనిర్బంధం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. మమ్మల్ని ఎంతగా అణచివేయాలని చూస్తే, అంత బలంగా తిరిగి లేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్‌ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని . బీజేపీ అండతో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు‘ అని ఆయన ఆరోపించారు. దాడులకు వచ్చిన అధికారుల్లో కనీసం ఒక్కరు కూడా తమిళం మాట్లాడేవారు లేరని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అరాచకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కార్తీ కార్యాలయంలో సోదాలు

కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరంకు శివగంగ జిల్లా కారైక్కుడిలో కార్యాలయం ఉంది. ఇక్కడ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సోమవారం ఉదయం హఠాత్తుగా సోదాలు చేశారు. ఈ సోదాలలో రూ. 13 లక్షలు నగదు పట్టుబడినట్టు సమాచారం. ఈ నగదును అధికారులు లెక్క పెడుతున్న సమయంలో మోటారు సైకిళ్లపై వచ్చి కొందరు బలవంతంగా లాక్కెల్లినట్టుగా వార్తలు రావడం కొత్త చర్చకు దారి తీసింది.

సీఎం స్టాలిన్‌ ఖండన

సెల్వపెరుంతొగైను టార్గెట్‌ చేసిన ఐటీ అధికారులు వ్యవహరించిన దూకుడును సీఎం ఎం.కే. స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయం కూడా లేని తరుణంలో, ప్రతిపక్షాలను ముట్టడించి భయపెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. ఓటమి భయంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకానికి తమిళనాడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు‘ అని స్టాలిన్‌ తన ఎక్స్‌పేజి ద్వారా హెచ్చరించారు.అయితే, ఆదాయ పన్ను శాఖ అధికారులు తాము ఆయన ఇంట్లో సోదాలు చేయలేదని వాదిస్తుండటం బట్టి చూస్తే, వచ్చి వెళ్లిన వారెవ్వరో అన్న చర్చ జోరందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement