తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే! | - | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే!

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

న్యూస్‌రీల్‌

– అరవింద్‌ కేజ్రీవాల్‌ ధీమా

సాక్షి, చైన్నె: డీఎంకే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చైన్నెకు వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తమిళనాడులో మళ్లీ స్టాలిన్‌ నాయకత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధికి పట్టం: గత ఐదేళ్ల డీఎంకే పాలనలో తమిళనాడు అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. తన మిత్రుడు స్టాలిన్‌ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో స్టాలిన్‌ భారీ మెజారిటీతో విజయం సాధించి, మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు‘ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. అయితే, స్టాలిన్‌ అందుకు లొంగకపోవడం వల్లే బీజేపీ ఆయనను టార్గెట్‌ చేస్తోందని ఆరోపించారు. స్టాలిన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల తమిళనాడు దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతోందని ఆయన కొనియాడారు. స్టాలిన్‌ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ ఎన్నికల్లో డీఎంకేను మళ్లీ గెలిపిస్తుందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

ఒకే దేశం..ఒకే సంస్కృతి బీజేపీ అజెండా..!

– తమిళనాడు ప్రచారంలో రాహుల్‌ గాంధీ

సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారి తూత్తుకుడి జిల్లాలోని డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి, అభ్యర్థులకు మద్దతుగా సోమవారం రెండు చోట్ల ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళనాడులోని అన్నాడీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భాషలు, సంస్కృతులు, చరిత్ర సమానంగా గౌరవించాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని రాహుల్‌ తెలిపారు. అయితే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రం ఒకే దేశం, ఒకే భాష, ఒకే చరిత్ర ఉండాలని కోరుకుంటున్నాయని మండిపడ్డారు. తమిళ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. ఢిల్లీ నుండి తమిళనాడును పాలించాలని బీజేపీ కంటున్న కలలు నెరవేరబోవమన్నారు. తమిళనాడులో ఒకప్పుడు బలంగా ఉన్న అన్నాడీఎంకేను తాజాగా కేసుల పేరిట లొంగ దీసుకుని, వారి ద్వారా తమిళనాడులోకి చొరబడే వ్యూహంతో బీజేపీ ఉందని, తమిళులు ఎన్నడూ ఇతరులకు తల వంచే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను తమిళులు ఎన్నటికీ అంగీకరించరని స్పష్టంచేశారు. మణిపూర్‌లో జరుగుతున్న అంతర్గత పోరును ప్రస్తావిస్తూ, బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

పళనిస్వామికి రజనీ

అభిమానుల మద్దతు

సాక్షి, చైన్నె:అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని సోమవారం సేలం నివాసంలో రజనీకాంత్‌ అభిమాన సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సేలం జిల్లా రజనీ అభిమాన సంఘం కార్యదర్శి పారప్పట్టి కనకరాజ్‌ నాయకత్వంలో సుమారు 500 మందికి పైగా రజనీ అభిమానులు ఎడప్పాడి పళనిస్వామిని కలిశారు. ఎన్నికల బరిలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీకి మద్దతు ప్రకటించిన రజనీ అభిమానులకు పళనిస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో, రజనీకాంత్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకేకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement