● 75 వేల మందితో స్టాలిన్ టెలీకాన్ఫరెన్స్ ● అన్నానగర్ పార్కులో వాకింగ్
సాక్షి, చైన్నె: ఓటింగ్ సమయం దగ్గర పడడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సోమవారం తన నివాసం నుంచి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బూత్ ఎజెంట్లకు అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఏక కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 వేల మంది డీఎంకే బూత్ ఏజెంట్లతో మాట్లాడారు. ద్రావిడ మోడల్ 2.ఓ షురూ అన్న ధీమాతో స్టాలిన్ ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఓ వైపు స్టాలిన్, మరో వైపు యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, పార్టీ డిప్యూటీ ప్రధానకార్యదర్శి కనిమొళి ప్రచారంలో దూసుకెళ్తూ వస్తున్నారు. డీఎంకే కూటమి పార్టీల నేతలు సైతం సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా కాల్ రూపంలో డీఎంకే బూత్ ఏజెంట్లకు స్టాలిన్ అలర్ట్ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యతకు దారి తీసింది.
మధ్యాహ్నం 12 గంటలకు ’మెగాకాల్’
సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్యాధునిక సాంకేతికత ఆధారంగా టెలీకాన్ఫరెన్స్ ద్వారా స్టాలిన్ క్షేత్రస్థాయి బూత్ ఏజెంట్లతో సంభాషించారు. పార్టీ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున నేరుగా ఏజెంట్లతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడంతో కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఫోన్ కాల్ సందర్భంగా సీఎం స్టాలిన్ ముఖ్యంగా పలు అంశాలను చర్చించారు. ఆ మేరకు నియోజకవర్గాల పరిస్థితి, ప్రతి బూత్ పరిధిలో ప్రజల నాడి ఎలా ఉంది? డీఎంకే పట్ల ఓటర్ల అభిప్రాయం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఓట్ల చీలిక నివారించే దిశగా ప్రభుత్వ అనుకూల ఓట్లు ఇతర పార్టీలకు చీలిపోకుండా చూడటానికి తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు. ఎన్నికల చివరి నిమిషం పనులే గెలుపును నిర్ణయిస్తాయి అని ఆయన నొక్కి చెప్పారు. ఓటరు జాబితాను సరిచూసుకోవడం నుండి ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించే వరకు ప్రతి అంశంపై దిశానిర్దేశం చేశారు.
ఏజెంట్లకు ’అలర్ట్’ వార్నింగ్
పోలింగ్ రోజున ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్టాలిన్ ఆదేశించారు: ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అని నిరంతరం గమనించాలని, పోలింగ్ ముగిసే వరకు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా బూత్ వద్దే ఉండాలని సూచించారు. ఎన్నికల రోజున ప్రతి నిమిషం అప్రమత్తత అవసరమని పిలుపునిచ్చారు. కాగా ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు నేరుగా బూత్ ఏజెంట్లతో స్టాలిన్ మాట్లాడటం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఉదయాన్నే సీఎం స్టాలిన్ అన్నానగర్ టవర్ పార్కు పరిసరాలలో వాకింగ్‌కు వెళ్లారు. ఈసందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.


