– ఎన్నికల కమిషన్ ఆదేశాలు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుండి ఏప్రిల్ 23 పోలింగ్ ముగిసే వరకు ’ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951’ సెక్షన్ 126 ప్రకారం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. ఈ వివరాలను సోమవారం ఆమె మీడియా ద్వారా వివరించారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. వాటిలో పాల్గొనడం కూడా నేరం అని హెచ్చరించారు. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
కఠిన శిక్ష
నిబంధనలను ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని హెచ్చరించారు. నియోజకవర్గ ఓటర్లు కాని పార్టీ కార్యకర్తలు, నాయకులు సాయంత్రం 6 గంటల లోపు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు.కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలో బయటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే అంశంపై అధికారులు తనిఖీలు చేస్తారని వివరించారు. స్టార్ క్యాంపెయినర్లతో సహా అభ్యర్థులకు ప్రచారం కోసం ఇచ్చిన వాహనాల అనుమతి సాయంత్రం 6 గంటలతో రద్దవుతుందన్నారు. ఇక, పోలింగ్ రోజున అభ్యర్థి సొంత వినియోగానికి ఒక వాహనం, ఎలక్షన్ ఏజెంట్ కోసం ఒక వాహనం, కార్యకర్తల కోసం మరొక వాహనం అంటూ మొత్తం మూడింటికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి వాహనాలను ఉపయోగిస్తే శిక్ష తప్పదన్నారు. పార్టీ ఎన్నికల కార్యాలయాలు పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరంలో మాత్రమే తాత్కాలికంగా ఉండాలని, ఇక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటుందన్నారు.పోలింగ్‌ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరుగుతుందన్నారు. తమిళనాడులో శాంతియుతమైన , పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


