కోవై రాజకీయాల్లో.. సరికొత్త మార్పు | - | Sakshi
Sakshi News home page

కోవై రాజకీయాల్లో.. సరికొత్త మార్పు

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

● కమల్‌ ధీమా

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల అనంతరం కోయంబత్తూరు రాజకీయాల్లో సరికొత్త మార్పు రాబోతోందని నటుడు, మక్కల్‌ నీది మయ్యం నేత, ఎంపీ కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరు జిల్లా పరిఽధిలోని పలునియోజకవర్గాలలో డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ముందుగా కోయంబత్తూరు (కోవై) దక్షిణ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్‌ బాలాజీకి మద్దతుగా కమల్‌ హాసన్‌ ఓటర్లను ఆకర్షించే దిశగా ముందుకెళ్లారు. కోయంబత్తూరుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇది నా ప్రజల నియోజకవర్గం

కోవై దక్షిణ నియోజకవర్గంలో తాను తిరగని వీధి లేదని, ఇక్కడి ప్రజలు తనపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని కమల్‌ అన్నారు. గతంలో ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ప్రజలు తనకు ఓట్లు వేశారని, అదే ప్రేమ ఇప్పుడు సెంథిల్‌ బాలాజీకి కూడా లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోయంబత్తూరులో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుండి రూ. 1.12 కోట్లు కేటాయించినట్లు కమల్‌ వెల్లడించారు. ఇది సహాయం కాదని, తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 15 పార్టీలను ఏకం చేయడం కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదని, సీఎం స్టాలిన్‌ గొప్ప మనసుకి ఇది నిదర్శనమని కొనియాడారు. డీఎంకేను ఓడించాలని చూసే వారికి బాస్‌ (యజమాని) ఉత్తరాదిలో ఉన్నారంటూ బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.కోయంబత్తూరుకు మెట్రో రైలు కావాలని కోరితే, తగినంత జనాభా లేదని సాకులు చెబుతున్నారని, అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మెట్రో సదుపాయాలు కల్పిస్తోందని ఆయన మండిపడ్డారు. గతంలో ఇక్కడ గెలిచిన వారు ఇప్పుడు నియోజకవర్గం మారడమే సెంథిల్‌ బాలాజీ విజయానికి నిదర్శనమని (సిట్టింగ్‌ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. తమిళనాడు సత్తా ఏంటో గత లోక్‌సభ ఎన్నికల్లోనే చూపించామని, ఏప్రిల్‌ 23న మళ్లీ నిరూపిస్తాం అని కమల్‌ హాసన్‌ పిలుపునిచ్చారు. అనంతరం, ఆయన అవినాశి (ఎస్సీ) నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి డాక్టర్‌ కోకిలమణి తరపున కూడా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పు రాబోతోందని కమల్‌ హాసన్‌ పదే పదే తన ప్రసంగంలో స్పష్టం చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement