ఆస్తుల గోప్యతపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఆస్తుల గోప్యతపై విచారణ

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల నామినేషన్ల వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. పలువురు ప్రముఖ అభ్యర్థులు తమ ఆస్తులు, కంపెనీల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని దాఖలైన పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ అంగీకరించింది.

దర్శకుడు సుందర్‌.సిపై తాజాగా పిటిషన్‌

మధురై సెంట్రల్‌ నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే కూటమిలో పుదియ నీతి కట్చి తరపున పోటీ చేస్తున్న ప్రముఖ దర్శకుడు సుందర్‌.సి తన నామినేషనన్‌లో సమాచారాన్ని దాచిపెట్టారని షకిలా అనే ఓటరు పిటిషన్‌ వేశారు. సుందర్‌.సి కి చెందిన టెలి మీడియా, మూవీస్‌, సినిమాక్స్‌ సంస్థలలో ఆయనకున్న వాటాలను, ఆ సంస్థల ద్వారా వస్తున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని వెల్లడించలేదని పిటిషనర్‌ ఆరోపించారు.దీనిపై ఆదాయపు పన్ను శాఖతో విచారణ జరిపించాలని కోరారు.

జాబితాలో విజయ్‌, ఇతర ప్రముఖులు

కేవలం సుందర్‌.సి మాత్రమే కాకుండా, మరికొంతమంది కీలక నేతలపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వీరిపై కూడా విచారణ జరపాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌, అభ్యర్థి ఆదవ్‌ అర్జున, అన్నాడీఎంకే మాజీ మంత్రులు జయకుమార్‌, తంగమణి, విజయభాస్కర్‌, సి.వి. షణ్ముగం, ఆర్‌.బి. ఉదయకుమార్‌, దిండిగల్‌ శ్రీనివాసన్‌, బీజేపీ అభ్యర్థులు తమిళిసై సౌందరరాజన్‌, వానతీ శ్రీనివాసన్‌ వంటి వారిపై ఇప్పటికే కోర్టుకు పిటిషన్లు చేరి ఉండటం గమనార్హం. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుల్‌ మురుగన్‌ ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తులు, ఈ కేసులను విచారణకు స్వీకరిస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ, ప్రధాన పార్టీల నేతలపై, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ వంటి వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయంగా చర్చ ఊపందుకుంది. కోర్టు ఇచ్చే ఆదేశాలు అభ్యర్థుల అర్హతపై లేదా ఎన్నికల విషయంలో ఏదేని ప్రభావం చూపించేనా అన్నది వేచి చూడాల్సిందే. కాగా విజయ్‌ విషయంలో ఆదాయపన్ను శాఖ కోర్టుకు వివరణ సమర్పించింది. మిగిలిన కేసులకు సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement