నగదు మాయం
తిరువళ్లూరు: కడంబత్తూరు సమీపంలో వరుసగా ఒకేరోజు ఐదు నివాసాల్లో చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కావాంగొలత్తూరు గ్రామానికి చెందిన రైతు మణి(69). ఇతను వేపంబట్టులోని బంధువు వివాహానికి ఆదివారం రాత్రి వెళ్ళి సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఇంటికి రాగానే తలుపులు పగలగొట్టి వుండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటిని పరిశీలించగా బీరువాలో వుంచిన పది సవర్ల బంగారు నగలు, కిలో వెండితో పాటు 35 వేల రూపాయల నగదు మాయమైట్టు నిర్ధారించారు. అదే ప్రాంతానికి చెందిన గుణశేఖరన్. ఇతను ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో వుంచిన 15 సవర్ల బంగారు నగలు, కిలో వెండి 12 వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్టు నిర్దారించారు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన శివభూషణం ఇంట్లో సైతం పది వేల నగదు, ఎనిమిది సవర్ల బంగారు నగలను, జయశంకర్‌కు చెందిన ఇంట్లో మూడు సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించారు. మొత్తానికి ఐదు ఇళ్లులో 33 సవర్ల బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ సేకరించిన ఆధారాల ద్వారా విచారణనూ ముమ్మరం చేశారు.


