సాక్షి, చైన్నె: ఎడప్పాడి నియోజకవర్గంలోని జలకంఠాపురం, చెట్టిమాంగురిచ్చి, ఎడప్పాడి, కొంగణాపురం ప్రాంతాల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సుడిగాలి పర్యటన చేశారు. జలకంఠాపురంలో జరిగిన సభలో పీఎంకే నేత రాందాసుతో కలిసి ప్రసంగించారు.
పార్టీలను చీల్చే కుట్ర
అన్నాడీఎంకేను నిర్వీర్యం చేసేందుకు డీఎంకే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదన్నారు. అదే విధంగా పీఎంకేను చీల్చాలని డీఎంకే చూసిందని ఆరోపించారు. అన్బుమణి రామదాస్ ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టి కాపాడుకున్నారన్నారు. అన్నాడీఎంకే, పీఎంకేలను ఓడించలేరన్నారు.
స్టాలిన్ పాలనపై విమర్శలు
సీఎం స్టాలిన్ తన కొడుకును ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడంపైనే దృష్టి పెట్టారు తప్ప, ప్రజల సంక్షేమం ఆయనకు పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ ఎన్నికలతో డీఎంకే పాలనకు చరమగీతం పాడడం ఖాయమని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పళణి స్వామి విన్నవించారు.
పళనిస్వామి ముఖ్యమంత్రి
మహిళలకు, తల్లులకు రక్షణ ఉండాలంటే ఎడప్పాడి పళనిస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, మరో రెండు వారాల్లో తమిళనాడులో కచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుందని తన ప్రసంగంలో అన్బుమణి వ్యాఖ్యలు చేశారు.


