వేలూరు కోట కోసం హోరాహోరీ | - | Sakshi
Sakshi News home page

వేలూరు కోట కోసం హోరాహోరీ

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

● గ్రీన్‌ సర్కిల్‌ నుండి బాగాయం వరకు విస్తరించి ఉన్న నిరంతర ట్రాఫిక్‌ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ● షెంబాక్కం, అలమేలురంగపురం, కొత్త, పాత బస్టాండ్‌ అనుసంధానించేలా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టాలి. ● స్మార్ట్‌ సిటీ పథకం కింద ప్రారంభించిన భూ గర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి. ● వేలూరు నగరంలో వ్యర్థాలను డంపింగ్‌ చేయ డానికి నిర్దేశిత స్థలం లేకపోవడం వల్ల, పాలార్‌ నదిని వ్యర్థాల డంపింగ్‌ యార్డ్‌గా ఉపయోగించే పద్ధతిని నిలిపివేయాలి. ● నగర మురుగునీటిని పాలార్‌ నదిలోకి వదల డాన్ని నివారించడానికి, భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి. ● అలమేలురంగాపురం, పెరుముగై వంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రాథమిక వసతులను మెరుగుపరచాలి. ● కస్పా, సైదాపేట వంటి ప్రాంతాలలో ఉన్న ప్రజా మరుగుదొడ్లు విశ్రాంతి గదుల సదుపాయాలను ఆధునీకరించాలి.

దీర్ఘకాలిక డిమాండ్లు

వేలూరు: 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో బొమ్ము నాయకులు మైదాన ప్రాంతంలో నిర్మించబడిన వేలూరు కోట, నేటికీ భారతదేశంలోని అత్యుత్తమ కందకం కలిగిన కోటలలో ఒకటిగా నిలిచి ఉంది. ఈ నగరం బ్రిటిష్‌ కాలం నాటి చారిత్రక ఆనవాళ్లను తనలో ఇముడ్చుకుంది. వీటిలో 1806లో కోట లోపలే జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామం(వేలూరు తిరుగుబాటు) జరిగిన ప్రదేశం. శతాబ్ధాల చరిత్ర కలిగిన, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎంసీ ఆసుపత్రి, వంద సంవత్సరాలకు పైగా నిలిచి ఉన్న మార్కెట్‌, మొదటి ప్రపంచ యుద్ధంలో సేవలందించిన వేలూరు సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన గడియారం స్తంభం కోట ప్రాంగణంలో ఉన్న 150 ఏళ్ల నాటి సెయింట్‌ జాన్స్‌ చర్చి, 125 ఏళ్ల నాటి ఊరీస్‌ కళాశాల, రాణి విక్టోరియా పాలన 50వ వార్షికోత్సవం సందర్భంగా వేలూరులో నిర్మించిన విక్టోరియా స్మారక స్తంభం వంటివి ఉన్నాయి. చైన్నె, బెంగళూరు మహానగరాల మధ్య నెలకొని, వేలూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వెలుగొందుతోంది.

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేలు

1952 నుండి శాసనసభ ఎన్నికలలో పాల్గొంటూ వస్తున్న వేలూరు, ప్రస్తుతం తన 17వ ఎన్నికను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు, కాంగ్రెస్‌ పార్టీ 5 సార్లు, డీఎంకే 8 సార్లు, అన్నాడీఎంకే 2 సార్లు విజయం సాధించగా స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి విజయాన్ని దక్కించుకున్నారు. వీఎం దేవరాజ్‌ 1980, 1984 మరియు 1989 ఎన్నికలలో వరుసగా హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేశారు. అదేవిధంగా సి.జ్ఞానశేఖరన్‌ 1991, 1996, 2001 మరియు 2006 ఎన్నికలలో హ్యాట్రిక్‌ విజయాలను సాధించారు. ఎంపీ సారథి 1957, 1967, 1971 సంవత్సరాలలో విజయాలను సాధించారు.

2026 ఎన్నికల రణరంగం

ప్రస్తుత శాసనసభ ఎన్నికలలో, ప్రస్తుత ఎమ్మెల్యే డీఎంకే తరఫున కార్తీకేయన్‌ మూడవసారి పోటీ చేస్తుండగా, ఎస్‌ఆర్‌కే అప్పు అన్నాడీఎంకే పార్టీ తరఫున రెండవసారి పోటీ చేస్తున్నారు. టీవీకే (తమిళగ వెట్రి కజగం) తరఫున వినోద్‌ కన్నన్‌ నామ్‌ తమిళర్‌ పార్టీ అద్వర్యంలో కళాశాల విద్యార్థిని సోనియాతో సహా మొత్తం 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు తమ సొంత పార్టీలలోనే తీవ్రమైన అంతర్గత రాజకీయ కుట్రలను ఎదుర్కొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం వారు హోరాహోరీగా పోరాడుతున్నారు. టీవీకే అభ్యర్థి ఓట్ల కోసం విజిల్‌ ఊదుతూ వార్డుల వారీగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల్లో ఆందోళన కలిగించింది. ఆయన ఎవరి ఓటు బ్యాంకును చీల్చుతారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నామ్‌ తమిళర్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కళాశాల విద్యార్థిని సోనియా చేపట్టిన ఇంటింటి ప్రచార ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయం.మొదలియార్లు, వన్నియర్లు, షెడ్యూల్డ్‌ కులాల వారు ప్రధాన వర్గాలుగా ఉన్నప్పటికీ, విజయం లేదా ఓటమి అనే తుది ఫలితాన్ని నిర్ణయించడంలో ముస్లిం వర్గం కీలక స్థానాన్ని కలిగి ఉంది.

అన్నాడీఎంకే: ఎస్‌ఆర్‌కే అప్పు

టీవీకే అభ్యర్థి వినోద్‌ఖన్నా

డీఎంకే అభ్యర్థి పి.కార్తికేయన్‌

వేలూరు నియోజక వర్గ ఓటర్లు

పురుషులు 103,205

మహిళలు 111,252

ఇతరులు 47

మొత్తం 214,504

Advertisement
 
Advertisement
Advertisement