తిరుత్తణి: నియోజకవర్గంలోని పళ్లిపట్టు, తిరుత్తణి, తిరువలంగాడు మండలంలోని తిరుత్తణి నియోజకవర్గం పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీల్లో తెలుగు వారు అధిక సంఖ్యలో నివశిస్తున్నారు. నియోజకవర్గంలో 337 పోలింగ్ బూత్‌లు ఉండగా, 2.65 లక్షల ఓటర్లు వున్నారు. ప్రధానంగా నేత పరిశ్రమ, వ్యవసాయం నియోజకవర్గ ప్రజల ప్రధాన జీవనాధారంగా ఉంది. తిరుత్తణి మున్సిపాలిటీ, పళ్లిపట్టు, పొదటూరుపేట టౌన్ పంచాయతీలు తిరుత్తణి నియోజకవర్గంలో పట్టణ ప్రాంత పరిధిలో ఉన్నాయి. దాదాపు 60 వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిలో 20 వేల మంది కమ్మ కులస్తులు ఉన్నారు. అదే సమయంలో నేత పరిశ్రమపై ఆధారపడిన సెంగుంద మొదలియార్లు 70 వేల ఓటర్లు, వన్నిరెడ్లు 50 వేల ఓటర్లు ఉన్నారు. దీంతో పాటు దళితులు 40 వేల ఓటర్లు, యాదవులు 25 వేల ఓటర్లు ప్రధాన కులాలుగా తిరుత్తణి నియోజకవర్గంలో నివశిస్తున్నారు. గతంలో తిరుత్తణిలో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. చివరగా 2011లో అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా అరుణ్‌సుబ్రహ్మణ్యం పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామన్‌పై పైచెయ్యి సాధించి విజయం సాధించారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా చంద్రన్, అన్నాడీఎంకే అభ్యర్థిగా హరి పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో చంద్రన్ 29 వేల మెజారిటీతో గెలుపొందారు. తిరుత్తణి నియోజకవర్గంలో వన్నియర్లు, మొదలియార్ల మధ్య పోటీ ఉండేది. చివరి ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అభ్యర్థులుగా పోటీ చేసిన చంద్రన్, హరి ఇద్దరూ వన్నిరెడ్లు కావడంతో పార్టీలు పరంగా ఓట్లు చీలాయి. దీంతో డీఎంకే అధికారంలోకి రావాలన్న ఆశయంతో పార్టీ శ్రేణులు కలిసికట్టు పోరాటంతో చంద్రన్‌ను ఎమ్మెగా గెలిపించాయి. తొలిసారి గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి. అప్రమత్తమైన హరి పార్టీ కూటమి బలంతో పాటు కులం కార్డును ప్రయోగిస్తున్నారు.
తిరుత్తణి మురుగన్ ఆలయం
టీవీకే అభ్యర్థి సత్యమూర్తి
నామ్ తమిళర్ అభ్యర్థి చంద్రన్
తిరుత్తణి మురుగన్ క్షేత్రంలో కులాభిమానం, భాషాభిమానం కార్డులను ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో విజయం ఎటు వైపు వస్తుందో నిర్ణయించడం సవాల్‌గా మారింది. ఆంఽధ్రాకు కూతవేటు దూరంలోని తిరుత్తణి నియోజకవర్గంలో తమిళం. తెలుగు ప్రజలు పాలు, నీరులా కలిసిమెలిసి నివశిస్తున్నారు. ఈ స్థితిలో విజయంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


