అన్బుమణి ప్రచారంలో విద్యారాణి టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

అన్బుమణి ప్రచారంలో విద్యారాణి టెన్షన్‌

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

సాక్షి, చైన్నె: మెట్టూరు సమీపంలోని మేచేరి బస్టాండ్‌ వద్ద అన్నాడీఎంకే అభ్యర్థి వెంకటాచలం తరపున పీఎంకే నేత అన్బుమణి ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో నామ్‌ తమిళర్‌ పార్టీ అభ్యర్థి విద్యా రాణి (స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె) తన మద్దతుదారులతో జెండాలు పట్టుకుని అన్బుమణి ప్రసంగిస్తున్న వేదిక వైపు దూసుకెళ్లడం ఉత్కంఠకు దారి తీసింది. అన్బుమణి ఆగ్రహం: విద్యా రాణి తనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అన్బుమణి రామదాస్‌ స్పందిస్తూ.. ‘ఇక్కడ నాటకాలు ఆడవద్దు‘ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వెంటనే పోలీసులను పిలిచి వారిని పంపించివేయాలని కోరారు. పోలీసుల జోక్యం: భద్రతా సిబ్బంది విద్యా రాణిని వారించినప్పటికీ, ఆమె అక్కడి నుండి వెళ్లేందుకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఆమెను, ఆమె మద్దతుదారులను బలవంతంగా అక్కడి నుండి తరలించారు.

రోడ్డుపై బైఠాయింపు: పోలీసుల చర్యతో కన్నీరు పెట్టుకున్న విద్యారాణి, తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. తనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులతో వాదించారు. అనంతరం పోలీసులు ఆమెను, మరో 20 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మీడియాతో విద్యా రాణి మాట్లాడుతూ ద్విచక్ర వాహన ర్యాలీ కోసం ముందస్తు అనుమతి తీసుకున్నాం. కానీ అన్బుమణి ప్రచారానికి అడ్డుకున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement