న్యూస్‌రీల్
– మెట్రో రైలు సంస్థ ప్రకటన
తిరువొత్తియూరు: మెట్రో రైలులో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం లేదా వారి ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం. ముఖ్యంగా, సెల్‌ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం, హెడ్‌ఫోన్స్ లేకుండా పాటలు వినడం లేదా వీడియోలు చూడటం, మెట్రో రైళ్లు , ప్రాంగణాల్లో లౌడ్‌స్పీకర్‌లనుఉపయోగించడం వంటివి నేరాలుగా పరిగణించబడతాయని మెట్రో అధికారులు ఆదివారం ఏ ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికులకు రూ. 500 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. తోటి ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ తప్పనిసరిగా హెడ్‌ఫోనన్స్‌ను ఉపయోగించాలని సూచించారు. మెట్రో రైలు, ప్రాంగణాల్లో గట్టిగా మాట్లాడటం వంటివి నివారించాలని తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఐజీ బదిలీ
● సెంథిల్ వేలన్ స్థానంలో అవినాష్ కుమార్
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో మరో కీలక మార్పు చేపట్టింది. ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా పనిచేస్తున్న సెంథిల్ వేలన్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో అవినాష్ కుమార్ ఐపీఎస్ ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల వేళ వరుస మార్పులు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 3 రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో తాజా నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త ఐజీగా నియమితులైన అవినాష్ కుమార్ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో గత కొద్ది రోజులుగా తమిళనాడులోని కీలక అధికారులను ఎన్నికల సంఘం వరుసగా మారుస్తూవ స్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం స్థానంలో సాయికుమార్‌ను నియమించారు. డీజీపీ (శాంతి భద్రతలు): వెంకటరామన్ బదిలీ కాగా, ఆయన స్థానంలో సందీప్ రాయ్ రాథోడ్ బాధ్యతలు చేపట్టారు. చైన్నె పోలీస్ కమిషనర్‌గా ఉన్న అరుణ్‌ను మార్చి, అబిన్ దినేష్ మోడక్‌ను నియమించారు. ఏసీబీ డీజీపీ డేవీడ్సన్ దేవాశీర్వాదంతో పలు జిల్లాల కలెక్టర్, ఐపీఎస్‌లు, కమిషనర్లను బదిలీ చేశారు. తాజాగా ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైనది కావడంతో, ఈ బదిలీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్సాహంగా పోస్టల్ బ్యాలెట్
● చైన్నెలో తరలి వచ్చిన పోలీసులు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యే పోలీసు అధికారుల కోసం ఏర్పా టు చేసిన పోస్టల్ బ్యాలెట్ (తపాలా ఓటు) తొలి దశ పోలింగ్ చైన్నెలో అత్యంత ఉత్సాహంగా జరి గింది. తమ నియోజకవర్గాల్లో ఎన్నికల రోజున విధుల్లో ఉండాల్సి రావడంతో, పోలీసులు ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
16 కేంద్రాల్లో పోలింగ్
చైన్నె జిల్లా పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులకు సంబంధించి మొత్తం 22,248 మంది పోలీసులు, హోంగార్డులను నియమించారు. వీరి కోసం ఎన్నికల సంఘం రెండు విడతల్లో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శనివారం మొదటి విడత పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి పొద్దుపోయే వర కు పోలీసులు ఉత్సాహంగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందు కోసం విల్లివాక్కం, అన్నా నగర్, పెరంబూర్ సహా 16 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరాల నిఘాలో, రిటర్నింగ్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా సాగింది. కాగా, తొలి విడతలో ఓటు వేయలేకపోయిన పోలీసుల కోసం సోమవారం రెండో విడత తపాలా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులందరూ 100 శాతం ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఎవరూ కూడా తమ ప్రజాస్వామ్య బాధ్యతను మర్చిపోకూడదు అని చైన్నె నగర పోలీ స్‌కమిషనర్ అబిన్‌దినేష్ మోడక్ పిలుపు నిచ్చారు.


