సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ సర్వత్రా ప్రచార బిజీలో ఉంటే ఆదివారం సాయంత్రం విరుదు నగర్ జిల్లానే ఉలిక్కి పడే రీతిలో బాణసంచా పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర బాణాసంచా ప్రమాదంతో పది కి.మీ దూరం భూమి కంపించినట్టుగా బాణా సంచాల మోత మోగింది.
ఐదేళ్లలో ఇదే అతిపెద్ద ప్రమాదం
విరుదునగర్ సమీపంలోని కట్టనార్‌పట్టి వద్ద జరిగిన శ్రీవనజ బాణాసంచా తయారీ కేంద్రంశ్రీ పేలుడు ఉదంతం తమిళనాడును ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 23కి చేరింది. గత ఐదేళ్ల కాలంలో బాణాసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నమోదైంది. పేలుడు సంభవించిన సమయంలో శబ్దం ఎంత బీభత్సంగా ఉందంటే.. ఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద ధాటికి కార్మికుల శరీరాలు చిద్రమై పడి పోవడం అక్కడి భీభత్స పరిస్థితికి అద్దం పడుతోంది.
కారణాలు: ఇరుకై న గదుల్లో ఎక్కువ మంది కార్మికులు పనిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడటం వల్లనే ఇంతటి నష్టం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
గత ఐదేళ్లలోని ప్రధాన ప్రమాదాలు
తమిళనాడు బాణసంచా హబ్‌గా ఉన్న విరుదునగర్ జిల్లాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2021 ఫిబ్రవరిలోఅచ్చాంకుళం గ్రామంలోని శ్రీ మరియమ్మల్ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 27 మంది మరణించారు. ఇదే ఇప్పటివరకు అతిపెద్ద ప్రమాదం.
2023 అక్టోబర్ హోసూర్ సమీపంలోని అత్తిపల్లి వద్ద బాణాసంచా లోడ్ దించుతుండగా జరిగిన పేలుడులో 14 మంది దుర్మరణం పాలయ్యారు. 2023 అక్టోబర్‌లో శివకాశి సమీపంలోని రెంకపాళయంలో జరిగిన ప్రమాదంలో 10 మంది (9 మంది మహిళలు) మరణించారు.2024 ఫిబ్రవరిలో వెంబకోట సమీపంలోని ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మృతి చెందారు. 2025లో విరుదునగర్ జిల్లాలో మొత్తం 16 ప్రమాదాలు జరగ్గా, 37 మంది మరణించారు.2026లో ఇప్పటివరకు కేవలం నాలుగు నెలల్లో పలు ప్రమాదాలు జరిగాయి.ఇందులో అతి పెద్ద ప్రమాదం తాజాగా చోటు చేసుకోవడంతో కలవరం తప్పడం లేదు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధిస్తున్నా, తనిఖీలు చేస్తున్నా.. ఇలాంటి ఘోరకలి పదే పదే పునరావృతం కావడం కార్మిక కుటుంబాల్లో తీవ్ర భయాన్ని, శోకాన్ని నింపుతోంది.


