సాక్షి, చైన్నె : న్యాయమూర్తుల అంకితభావం, న్యాయవాదుల వృత్తిపరమైన నైపుణ్యం పరస్పరం తోడైనప్పుడే సామాన్య ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన న్యాయం అందుతుందరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. మదురై జిల్లా కోర్టు ప్రాంగణంలో రూ. 166 కోట్ల వ్యయంతో నిర్మించిన 18 కోర్టు గదుల అదనపు భవనాన్ని, అలాగే మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అదనపు అతిథి గృహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం. ధర్మాధికారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మద్రా సు హై కోర్టు, మధురై ధర్మాసనం న్యాయమూర్తులు , సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయ వ్యవస్థకు వెన్నెముక
ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా కోర్టులే వెన్నెముక అని, ఉన్నత న్యాయస్థానాలు చట్టాలను రూపొందించినప్పటికీ.. వాటికి ప్రాణం పోసేది దిగువ కోర్టులేనని కొనియాడారు. ఆధునిక వసతులతో కూడిన భవనాలు కేసుల జాప్యాన్ని తగ్గించి, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు. నేర, సివిల్ , రాజ్యాంగపరమైన కేసుల పరిష్కారంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ అద్భుతమైన కృషి చేస్తోందని ప్రశంసించారు.
న్యాయమూర్తుల సందేశం..
జస్టిస్ జె.కె. మహేశ్వరి మాట్లాడుతూ, కోర్టు భవనాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదని, న్యాయవాదులు నిజాయితీతో వాదించినప్పుడే అవి న్యాయ దేవాలయాలుగా మారుతాయన్నారు. యువ న్యాయవాదులు ఈ–ఫైలింగ్ వంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ మాట్లాడుతూ, న్యాయం అనేది త్రాసులా నిష్పక్షపాతంగా ఉండాలని, కన్నగి కాలం నాటి నుంచే న్యాయం పొందడం సులభతరంగా ఉండేదని గుర్తుచేశారు. జస్టిస్ ఆర్. మహదేవన్ మాట్లాడుతూ, న్యాయస్థానాల నిర్మాణం కేవలం అధికారం మాత్రమే కాదు, అది ప్రజల బాధలను తొలగించే బాధ్యత అని పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ ఎస్.ఎం. ధర్మాధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం రూ. 166 కోట్లతో మూడు అంతస్తుల్లో 18 కోర్టు గదులను నిర్మించామని, భవిష్యత్తులో దీనిని 10 అంతస్తులకు విస్తరించి మొత్తం 30 కోర్టు గదులను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన తమిళనాడు ప్రభుత్వం , ప్రజా పనుల విభాగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ ధనపాలన్, మదురై బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.


