సాక్షి, చైన్నె : డీఎంకే కూటమి తరపున విరుదాచలంలో పోటీ చేస్తున్న డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ విజయానికి మద్దతుగా డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత కనిమొళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రేమలత గురించి ఆసక్తికర వ్యాఖ్యలను కనిమొళి చేశారు. కరువేప్పిలంకురిచ్చి లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కెప్టెన్ విజయకాంత్ ఎంత ధైర్యంగా, సామాన్య ప్రజల మనిషిగా జీవించారో, ప్రేమలత కూడా అంతే ధైర్యవంతురాలు అని వివరించారు. ఆమె తన కు చిరకాల మిత్రురాలు అని, ఇక విరుదాచలం నియోజకవర్గం సీఎం సోదరి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంగా మారుతుందన్నారు. ఇక్కడున్న అన్ని సమస్యలు, కోరికలన్నీ నెరవేర్చే స్థానంలో ఆమె ఉంటార్ఙు అని వివరించారు.
బీజేపీ కూటమిని ఎందుకు వీడారంటే?
ప్రేమలత బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి డీఎంకేతో చేతులు కలపడానికి గల కారణాలను కనిమొళి వివరించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడుకు అన్యాయం చేసేలా నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని జొప్పించారని ఆమె ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం చెప్పే అబద్ధాలను భరించలేకే సోదరి ప్రేమలత అక్కడి నుంచి బయటకు వచ్చారన్నారు. మహిళా బిల్లు ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తున్న వారికి తామంతా కలిసి సరైన బుద్ధి చెప్పామన్నారు.
ఎడప్పాడిపై విమర్శలు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై కూడా కనిమొళి విరుచుకుపడ్డారు. పళనిస్వామికి రాష్ట్ర హక్కుల కంటే తన స్వార్థమే ముఖ్యమని, ఆయన కేవలం అధికార దాహంతో ఇతరులకు బానిసగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పరాజయం తప్పదని ఆమె జోస్యం చెప్పారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రేమలత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, ఆమె నియోజకవర్గంలో ప్రచారం చేయడం తనకు సంతోషంగా ఉందని కనిమొళి వ్యాఖ్యలు చేశారు.


