చిత్తిరై ఉత్సవాలు
సాక్షి, చైన్నె: ఆధ్యాత్మిక నగరం మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహోత్సవ వైభవం ఆదివారం ప్రారంభమైంది. నగరం అంతా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొత్త శోభ సంతరించుకుంది. ఉదయం శివాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగిన పూజాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహనం జరిగింది. ఈ సందర్భంగా శివనామస్మరణతో మదురై తిరువీధులు మర్మోగాయి.
మదురై పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువు దీరి ఉన్నది సాక్షాత్తు ఆ పార్వతీ దేవి అవతారమే. ఈ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఇక్కడ ఏడాది పొడవున ఉత్సవాలు జరిగినా, చిత్తిరై ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. తమిళనాడు నుంచే కాదు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు మదురై వైపుగా పోటెత్తుతారు. అందుకే ఆధ్యాత్మిక నగరం మదురై నగరంలో పండుగ శోభ సంతరించుకునే విధంగా బ్రహ్మోత ఏర్పాట్లు చేశారు.
ధ్వజారోహణం..
ధ్వజారోహణంతో ఆదివారం బ్రహ్మోత్సవాలకు చుట్టారు. వేకువ జాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారిని వేర్వేరుగా బంగారు సింహాసనంలో అధిష్టింప చేసి ఆలయం ఆవరణలో ధ్వజ స్థంబంవద్దకు తీసుకొచ్చారు. స్వామి, అమ్మవారులు అక్కడ ఆశీనులు కాగా, శివాచార్యులనేతృత్వంలో 56 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు ద్వజ స్థంబం వద్ద విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. 12 రోజుల పాటుగా వైభవోపేతంగా జరిగే చిత్తిరై బ్రహ్మోత్సవాలకు శాస్రోక్తంగా పూజలతో శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం జరిగింది. ఈ సమయంలో భక్తులు శివనామ్మ సర్మణను మర్మోగించారు. బ్రహోత్సవ వైభవంలో ప్రతి రోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ప్రతి రోజు మాసి వీధుల్లో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 26వ తేది తేదిన అమ్మవారి పట్టాభిషేకం, 27 తేదీన దిగ్విజయం, 28వ తేదిన మీనాక్షి, సుందరేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం 29వ తేదిన రథోత్సవం, 30 తేదిన తీర్థవారి కార్యక్రమాలు జరగనున్నాయి. మే 1వ తేది కళ్లలగర్ స్వామి వారి వైగై నదీ ప్రవేశ ఉత్సవం జరగనుంది. చిత్తిరై ఉత్సవాలతో మదురైలో పండుగ శోభ సంతరించుకుంది. నగరం అంతా విద్యుత్ దీప కాంతుల మయం చేశారు.


