సాక్షి, చైన్నె: ప్రముఖ విద్యాసంస్థ అగర్‌చంద్ మాన్ముల్ జైన్ (ఏ.ఎం. జైన్) కళాశాల తన స్వయం ప్రతిపత్తి విభాగం 50వ పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ చారిత్రాత్మక వేడుకలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన 1,461 మంది విద్యార్థులు డిగ్రీలను అందుకున్నారు. మూడు సెషన్లుగా జరిగిన ఈ వేడుకకు ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఇతర సెషన్లలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హరి పరంధామన్ , డెక్సియన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రాజగోపాలన్ (ఇద్దరూ ఈ కళాశాల పూర్వ విద్యార్థులే) అతిథులుగా విచ్చేశారు.2024 బ్యాచ్‌కు చెందిన 34 మంది విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో టాప్–10 ర్యాంకులు సాధించారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్‌మెంట్ విభాగాలతో పాటు క్రిమినాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మరియు విజువల్ కమ్యూనికేషన్ వంటి ఆధునిక కోర్సులలో విద్యార్థులు పట్టాలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, సమాజానికి మేలు చేసే ఆవిష్కరణల వైపు దష్టి సారించాలని ఆయన కోరారు. కళాశాల అసోసియేట్ సెక్రటరీ హేమంత్ పి. చోర్డియా మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తాము ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.


