స్వతంత్ర అభ్యర్థే పార్టీకి దిక్కు | - | Sakshi
Sakshi News home page

స్వతంత్ర అభ్యర్థే పార్టీకి దిక్కు

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

● మద్దతు ప్రకటించిన టీవీకే ● ఎడప్పాడిలో టీవీకి ఓటేయాలన్న విజయ్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సేలం జిల్లాలోని కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కె. ప్రేమ్‌కుమార్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రేమ్‌కుమార్‌ను టీవీకే అభ్యర్థిగా భావించి టీవీ చిహ్నంలో ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు. ఎడప్పాడి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీవీకే అభ్యర్థిగా అరుణ్‌కుమార్‌ను విజయ్‌ నిలబెట్టారు. అయితే, నామినేషన్‌ దాఖలు తదుపరి ఆయన పత్తా లేకుండా పోయారు. నామినేషన్‌ సైతం తిరస్కరణకు గురైంది. మొక్కుబడిగానే ఆయన నామినేషన్‌ దాఖలు చేసినట్టు టీవీకే వర్గాలు గుర్తించారు.దీంతో ఆయన్ను పక్కన పెట్టారు. అదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న తన అభిమాని ప్రేమ్‌కుమార్‌ను తాజాగా టీవీకే అభ్యర్థిగా గుర్తించే పనిలో పడ్డారు. అయితే, సమయం మించిన దృష్ట్యా,ఆయనకు కేవలం మద్దతును ప్రకటిస్తూ విజయ్‌ ప్రకటన చేశారు.

సొంత మనిషికే జై కొట్టండి..

ఎడప్పాడి నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు అంటూ విజయ్‌ లేఖ విడుదల చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమ్‌కుమార్‌ మన అభిమాన సంఘం మాజీ నాయకుడు, మన సోదరుడు. ఈ ఎన్నికల్లో మన పార్టీ తరపున ప్రేమ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా సమర్థించాలని నిర్ణయించుకున్నాం. ఆయనకు కేటాయించిన శ్రీటెలివిజన్‌శ్రీ (టీవీ) గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాన్ఙు అని పేర్కొన్నారు.అలాగే, పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణపై విజయ్‌ ఘాటుగా స్పందించారు. శ్రీకుటిల మార్గాల్లో గెలవాలని చూస్తూ, టీవీకే గుర్తును అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పేలా ప్రేమ్‌కుమార్‌ విజయం ఉండాల్ఙి అని పిలుపునిచ్చారు. కాగా ఈనియోజకవర్గంలో మాజీ సీఎం పళనిస్వామి (అన్నాడీఎంకే), కాశీ (డీఎంకే) వంటి ఉద్ధండులు బరిలో ఉండగా, విజయ్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగడంతో చివరిక్షణంలో రాజకీయ సెగను పెంచినట్లయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement