అధికారంలోకి రాగానే కార్తీకదీపం వెలిగిస్తాం! | - | Sakshi
Sakshi News home page

అధికారంలోకి రాగానే కార్తీకదీపం వెలిగిస్తాం!

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

●తిరుప్పర కుండ్రం వ్యవహారంలో

రాజ్‌నాథ్‌ సింగ్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడగానే తిరుప్పరం కుండ్రంలో ఘనంగా కార్తీక దీపం వెలిగిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూరు బీజేపీ అభ్యర్థి ఆనందన్‌ అయ్యసామి తరపున పులియంగుడిలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ధర్మంపై డీఎంకే దాడి..

డీఎంకే ప్రభుత్వం మన విశ్వాసాలను నిరంతరం అవహేళన చేస్తోందన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు విచారకరంగా పేర్కొన్నారు. తిరుప్పరంకుండ్రం మురుగన్‌ ఆలయంలో దీపం వెలిగించేందుకు వచ్చిన భక్తులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అడ్డుకుంటోందని, తమ కూటమి అధికారంలోకి రాగానే అక్కడ దీప ప్రజ్వలన చేస్తాం అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

అప్పుల ఊబిలో తమిళనాడు

ఈరాష్ట్రం తాజా అప్పు రూ. 10.27 లక్షల కోట్లకు చేరిందని, అయితే, డీఎంకే రూపంలో ప్రజలకు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. గత 11 ఏళ్లలో కేంద్రం తమిళనాడుకు రూ. 11 లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ సొమ్ము ప్రజలకు చేరకుండా డీఎంకే నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే ప్రజల సొమ్మును రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. కల్లకురిచ్చి కల్తీ సారాయి మరణాలు, చిన్నారులపై నేరాలు, దళితులపై దాడులు పెరగడం స్టాలిన్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రాజ్‌నాథ్‌ అన్నారు. నియోజకవర్గానికి ఒక సారాయి మాఫియా తయారైందని, వాటిని వేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. తమిళనాడు ప్రజలు మార్పును, అభివృద్ధిని కోరుకుంటున్నారని, రేపు మనదే..! అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం రామనాథపురం, తిరునల్వేలిలో పలు నియోజకవర్గాలలో ఓపెన్‌ టాప్‌ వాహనంలో పర్యటించారు.

Advertisement
 
Advertisement
Advertisement