4 కీలక స్థానాల బరిలో ఉద్దండులు
నువ్వా..నేనా అన్నట్టుగా సమరం
చక్రం తిప్పెదెవరో..?
సాక్షి, చైన్నె : కొంగు మండలంలో ప్రధాన నగరంగా ఉన్న కోయంబత్తూరులో తాజాగా నాలుగు హాట్ సీట్లపై అందరి దృష్టి పడింది. ఇందులో రెండు స్థానాలలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన ఇద్దరు కింగ్ మేకర్లు పోటీ పడుతున్నారు. దీంతో ఎవర్నీ గెలుపు వరిస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వివరాలు.. పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్, కరూర్, ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాలను కొంగు మండలంగా పిలవడం జరుగుతున్నది. ఈ జిల్లాలకు ప్రధాన కేంద్రంగా కోయంబత్తూ రు ఉంది. రాజధాని నగరం చైన్నె తదు పరి రాష్ట్రంలో రెండో స్థానంలో అతి పెద్ద నగరం ఇది ఉంది. పారిశ్రామికంగా, పర్యాటకంగా, రమణీయత కు ప్రతి కూలంగా ఉన్న అనేక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిపై అందరి దృష్టి ఉంది. ఇందులోనూ తొండాముత్తూ రు, కోయంబత్తూరు ఉత్తరం, కోయంబత్తూ రు దక్షిణం, పొల్లాచ్చిలు ఉన్నాయి.
ఈజిల్లాలోని మరో వీఐపీ నియోజకవర్గంగా పొల్లాచ్చి ఉంది. ఇక్కడ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని అన్నాడీఎంకేకు చెందిన పొల్లాచ్చి వీ జయరామన్ సొంతం చేసుకుని ఉన్నారు. తాజా గా నాలుగో సారి విజయం కోసం సిద్ధమయ్యారు. ఈయన్ను అడ్డుకునేందుకు డీఎంకే అభ్యర్థిగా కె నిత్యానంద , ఎన్‌టీకే అభ్యర్థిగా సెంథిల్, టీవీకే అభ్యర్థిగా జీ రామనాథన్ ఉన్నారు. ఇక్కడ 2,02,015 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామాలతో నిండిన ఈనియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఎందరున్న గెలుపు తనదే అన్న ధీమాతో పొల్లాచ్చి వి. జయరామన్ ఉండటం గమనార్హం.
దక్షిణంలో డీఎంకే కింగ్ మేకర్
కొంగు మండలం ఇన్‌చార్జ్‌గా డీఎంకేలో వి. సెంథిల్ బాలాజీ కీలకంగా ఉన్నారు.ఆయన ద్వారానే సీఎం స్టాలిన్ ఇక్కడ వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నారు.తన సొంత జిల్లా కరూర్‌ను వదులకుని కోయంబత్తూరుపై సెంథిల్ బాలాజీ గత కొంత కాలంగా దృష్టి కేంద్రీకరించారు. అదే సమయంలో ఈ సారి ఎన్నికలలో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం అభ్యర్థిగా సెంథిల్ బాలాజీని రంగంలోకి దించారు. ఇక్కడ సెంథిల్ బాలాజీ పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ తన మకాంను ఉత్తరానికి మార్చుకున్నారు. అదే సమయంలో ఉత్తరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్మన్ కే అర్జున్ గతంలో తనను రెండు సార్లు గెలిచిపించిన దక్షిణం వైపుగా దృష్టి పెట్టి సెంథిల్ బాలాజీకి గట్టి పోటీ ఇచ్చే దిశగా అవతరించారు. కొంగు మండలంలోని అన్నాడీఎంకే కంచుకోటలన్నింటిని బద్దలు కొట్టడం లక్ష్యంగా వి. సెంథిల్ బాలాజీ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న సెంథిల్ బాలాజీ క్షేత్ర స్థాయిలో డీఎంకేను బలోపేతం చేయడంలో సఫలీకృతులయ్యారు. అదే సమయంలో ఈ ఎన్నికలలో కొంగు మండలం డీఎంకే గుప్పెట్లోకి చేరినపక్షంలో కింగ్ మేకర్‌గా ఆయన అవతరించడం ఖాయం. అయితే, సెంథిల్‌ను ఓడించేందుకు స్థానికేతరుడు అన్న నినాదాన్ని బలంగా ప్రజలలోకి అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ తీసుకెళ్తున్నారు. ఈ సముజ్జీల మధ్య సమరంలో ఓట్ల చీలికలో కీలక పాత్ర పోషించే దిశగా ఎన్‌టీకే తరపున వీ పేరరివాలన్, టీవీకే తరపున వీ సెంథిల్ కుమార్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1,86,509 మంది ఓటర్లు ఉన్నారు. సమస్యలన్నది పక్కన పెడితే, సామాజిక బలం అన్నది గెలుపునకు కీలకంగా ఉండటం గమనార్హం.


